Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో కలకలం సృష్టిస్తోన్న వరుస ఉగ్రఘటనలు

జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో గత మూడు రోజుల వ్యవధిలో మూడుసార్లు ఉగ్రవాదులు పంజా విసిరారు. ఈ వరుస ఘటనలతో స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. 

Updated : 12 Jun 2024 11:06 IST

దిల్లీ: జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో వరుస ఉగ్రఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలో మూడుసార్లు ఉగ్రదాడులు జరిగాయి.భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో ఒక సీఆర్‌పీఎఫ్ జవాన్‌ అమరులయ్యారు. ఆరుగురు సిబ్బంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.

యాత్రికులే లక్ష్యంగా జమ్మూ కశ్మీర్‌లో పర్యాటక బస్సుపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఈ ఘటన జరిగింది. అది మరువకముందే మంగళవారం సాయంత్రం కథువా జిల్లాలోని హీరానగర్ సెక్టార్‌లోని ఒక ఇంటిపై దాడి జరిగింది. ఆ ఇంటి యజమాని గాయాలపాలయ్యారు. దానిపై సమాచారం అందుకున్న పోలీసులు, పారామిలిటరీ బలగాలు నిర్వహించిన ఆపరేషన్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. మరొకరి కోసం డ్రోన్ల సాయంతో గాలింపు చేపట్టారు. కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ ఈ వివరాలు వెల్లడిస్తూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఒక సీఆర్‌పీఎఫ్ జవాన్‌ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. 

ఆ తర్వాత దోడా జిల్లాలోని భదర్వా-పఠాన్‌కోట్‌ రహదారి సమీపంలోని ఒక చెక్‌పోస్టుపై మంగళవారం అర్ధరాత్రి ఉగ్రదాడి జరిగింది. ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తోన్న దానిపై పలురౌండ్లు కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. దాంతో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఐదుగురు భద్రతా సిబ్బంది, ఒక పోలీసు అధికారి గాయపడ్డారు. దాంతో రెండువర్గాల మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది. 

పూంఛ్, రాజౌరీ ప్రాంతాలతో పోలిస్తే..రియాసీలో ఉగ్ర ఘటనల తీవ్రత తక్కువ. కానీ ప్రస్తుతం అలాంటి ప్రాంతాల్లో ఉగ్రవాదులు పంజా విసురుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇక హీరానగర్ సెక్టార్‌లోని ఇంటిపై కాల్పులు జరగడానికి ముందు.. ఉగ్రవాదులు పలు ఇళ్లకు వెళ్లి తాగేందుకు నీరు అడిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. తమ కదలికలపై గ్రామస్థులకు అనుమానం వచ్చిందని గ్రహించిన వారు ఒక ఇంటిపై దాడి చేశారు. అయితే ఘటనలో ముగ్గురు స్థానికులు మృతి చెందారని, పలువురు గాయపడ్డారంటూ వచ్చిన వార్తలను పోలీసు ఉన్నతాధికారులు ఖండించారు. ఒకవ్యక్తి గాయపడ్డారని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని