Cruise ship: ఐసోలేషన్‌లో ఉండేందుకు ఒప్పుకోని కొవిడ్‌ బాధితులు..మిగతా ప్రయాణికుల ఆందోళన

రెండు వేలకు పైగా మంది ప్రయాణికులతో ముంబయి నుంచి గోవా వెళ్లిన కార్డెలియా క్రూయిజ్‌ నౌకపై పదుల సంఖ్యలో కరోనా కేసులు వెలుగుచూసిన విషయం తెలిసిందే.

Updated : 04 Jan 2022 17:01 IST

షిప్‌ను తిరిగి ముంబయి పంపిన అధికారులు

పనాజీ: రెండు వేల మందికిపైగా ప్రయాణికులతో ముంబయి నుంచి గోవా వెళ్లిన కార్డెలియా క్రూయిజ్‌ నౌకలో పదుల సంఖ్యలో కరోనా కేసులు వెలుగుచూసిన విషయం తెలిసిందే. నౌకలో ఒక ఉద్యోగి సహా 66 మందికి వైరస్‌ పాజిటివ్‌గా రావడంతో అందులో నుంచి ఎవర్నీ బయటకు పంపొద్దని గోవా అధికారులు ఆదేశించారు. దీంతో నౌకను తిరిగి ముంబయి పంపించారు. అందులో కొవిడ్‌ బాధితులను ఐసోలేషన్‌లో ఉంచకపోవడంపై మిగతా ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ క్రూయిజ్‌ నౌకలో తొలుత ఓ ఉద్యోగి అనారోగ్యానికి గురయ్యారు. షిప్‌లోని వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇందులోని ప్రయాణికులు, సిబ్బందికి ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు. మొత్తంగా 66 మందికి కొవిడ్‌ సోకినట్లు తేలింది. కరోనా బాధితులు నౌక నుంచి దిగి గోవా తీరంలోని ఓ ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. కానీ 27 మంది బాధితులు ఇందుకు అంగీకరించలేదు. కరోనా సోకిన నౌక సిబ్బంది మాత్రం గోవాలోని ఆసుపత్రిలో చేరారు. 

దీంతో చేసేదేం లేక, గోవా యంత్రాంగం ఆ నౌకను తిరిగి ముంబయి పంపించేయాలని ఆదేశించింది. కొవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తులను కూడా నౌకలోనే పంపించింది. నిన్న అర్ధరాత్రి సమయంలో ఈ నౌక ముంబయి తిరుగుపయనమైంది. ప్రస్తుతం కొవిడ్ బాధితులు, నెగెటివ్‌ వచ్చిన వారంతా నౌకలో ఉన్నారు. దీంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిని ఐసోలేషన్‌లో ఉంచకుండా తమతో పాటే నౌకలో ఉంచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నానికి నౌక ముంబయి తీరం చేరే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని