దేవుడా.. ఈ బిడ్డను సురక్షితంగా ఉంచు: భూప్రకంపనల మధ్యే సి-సెక్షన్ చేసిన వైద్యులు..!

భూకంపం(earthquake) వచ్చిందని కంగారు పడకుండా వైద్యులు తమ పని పూర్తిచేశారు. కశ్మీర్‌లో ఓ బిడ్డకు ప్రాణం పోశారు. 

Published : 22 Mar 2023 18:17 IST

దిల్లీ: మంగళవారం రాత్రి సంభవించిన భూకంపం(Earthquake) దక్షిణాసియా దేశాల్లో భయాందోళనలను సృష్టించింది. కొన్ని సెకన్లపాటు వచ్చిన ప్రకంపనలతో ఉత్తర భారత్‌లో పలు భవనాలు దెబ్బతిన్నాయి. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగుతీశారు. కానీ కశ్మీర్‌(Kashmir)లోని ఓ ఆసుపత్రిలో అదే సమయంలో వైద్యులు సి-సెక్షన్(C-Section) నిర్వహిస్తున్నారు. దాంతో ఆపరేషన్ రూమ్‌లోనూ ఆ కదలికలు కనిపించాయి. అయినా వైద్యులు తమపని కొనసాగించారు. దీనికి సంబంధించిన దృశ్యాలను అనంత్‌నాగ్ జిల్లా యంత్రాంగం ట్విటర్‌లో పోస్టు చేసింది. 

అనంత్‌నాగ్‌లోని ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ఆపరేషన్‌ చేస్తున్నారు. అప్పుడే భూకంపం వచ్చింది. దాని ప్రభావం గదిలోనూ కనిపించింది. వైద్య సామగ్రి, ఓవర్‌హెడ్‌ లైట్స్‌, మానిటర్‌, ఐవీ డ్రిప్ స్టాండ్‌ ఊగడం ప్రారంభించాయి. అప్పుడే ఓ వ్యక్తి దేవుడికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. బిడ్డను సురక్షితంగా ఉంచు.. అని మధ్యలో ఓ వైద్యుడు మాట్లాడటం వినిపిస్తోంది. సరిగ్గా ఆ సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అప్పుడు అక్కడ మానిటర్ వెలుగు మాత్రమే ఉంది. కొన్ని సెనన్ల పాటు ఈ అంతరాయం కొనసాగినప్పటికీ.. వైద్యులు కంగారు పడకుండా తమ పని పూర్తి చేశారు. ‘సమస్యేం లేదు. అంతా ఓకే’ అంటూ మరొకరు రిలాక్స్‌ అయ్యారు. దీనిపై జిల్లా వైద్యాధికారులు.. సదరు సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.  క్లిష్ట సమయంలోనూ ప్రశాంతంగా తమ విధులు నిర్వర్తించడాన్ని కొనియాడారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని