India-China: చైనా వల్లే ఈ పరిస్థితులు.. డ్రాగన్‌ తీరు ప్రపంచానికి ఆందోళనకరం

సరిహద్దులకు సంబంధించిన రాతపూర్వక ఒప్పందాలను చైనా విస్మరించడం వల్లే వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయని భారత విదేశాంగ మంత్రి

Updated : 12 Feb 2022 10:48 IST

భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ ధ్వజం

మెల్‌బోర్న్‌: సరిహద్దులకు సంబంధించిన రాతపూర్వక ఒప్పందాలను చైనా విస్మరించడం వల్లే వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ అన్నారు. డ్రాగన్‌ తీరు ప్రపంచానికి ఆందోళనకరంగా మారుతోందని దుయ్యబట్టారు.

భారత్‌, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్‌లతో కూడిన క్వాడ్‌ కూటమి శుక్రవారం సమావేశమయ్యింది. మెల్‌బోర్న్‌(ఆస్ట్రేలియా)లో జరిగిన ఈ సమావేశానికి భారత్‌ నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్‌ హాజరయ్యారు. శనివారం ఆయన ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్, చైనా మధ్య నెలకొన్న లద్దాఖ్‌ ప్రతిష్టంభన గురించి క్వాడ్‌ భేటీలో చర్చ జరిగిందా? అని విలేకరులు ప్రశ్నించారు. దీనికి జైశంకర్ స్పందిస్తూ.. ‘‘అవును. భారత్‌-చైనా సంబంధాల గురించి మేం చర్చిచాం. ఎందుకంటే మా పొరుగున ఏం జరుగుతుందో వివరించాల్సిన బాధ్యత మాపై ఉంది. సరిహద్దుల్లో అధిక మొత్తంలో బలగాలను మోహరించకూడదని భారత్‌ - చైనా మధ్య రాతపూర్వక ఒప్పందాలు జరిగాయి. అయితే 2020లో డ్రాగన్‌ వాటిని విస్మరించింది. అందుకే వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఒక పెద్ద దేశం ఇలా రాతపూర్వక ఒప్పందాలను విస్మరిస్తే.. అది అంతర్జాతీయ సమాజానికి ఆందోళన కలిగించే సమస్యే’’ అని వ్యాఖ్యానించారు.

2020 ఏప్రిల్‌లో చైనా బలగాలు భారత్‌ భూభాగంలోకి అక్రమంగా చొరబడటంతో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే 2020 జూన్‌ 15న గల్వాన్‌ లోయ వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలతో పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చింది. దీంతో రెండు దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇరు దేశాలు ఇప్పటికే పలుసార్లు కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చలు జరిపాయి. ఈ చర్చలకు అనుగుణంగా పాంగాంగ్‌ సరస్సుతో పాటు, గోగ్రా ప్రాంతాల్లో భారత్, చైనా బలగాలను ఉపసంహరించుకున్నాయి. అయితే ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని