bombay high court: నాగరిక సమాజంలో ‘కస్టడీ మరణం’ దారుణమైన నేరం

నాగరిక సమాజంలో కస్టోడియల్‌ మరణం అనేది అత్యంత దారుణమైన నేరాల్లో ఒకటని ముంబయి హైకోర్టు పేర్కొంది. అధికారం ముసుగులో పోలీసులు ఇటువంటి చర్యలకు పాల్పడటం సరికాదని స్పష్టం చేసింది.

Updated : 20 Jan 2023 19:39 IST

ముంబయి: నాగరిక సమాజంలో కస్టడీ మరణం (Custodial Death) అనేది అత్యంత దారుణమైన నేరాల్లో ఒకటని బాంబే హైకోర్టు పేర్కొంది. అధికారం ముసుగులో అమానవీయ పద్ధతిలో పౌరులను చిత్రహింసలకు గురిచేయడం పోలీసులకు తగదని స్పష్టం చేసింది. మహారాష్ట్రలో ఓ కస్టోడియల్‌ డెత్‌కు సంబంధించిన కేసును విచారించిన జస్టిస్‌ విభ కంకన్వాడీ, జస్టిస్‌ అభయ్‌ వాగ్‌వాసే కూడిన ఔరంగాబాద్‌ ధర్మాసనం.. బాధితుడి తల్లికి రూ.15 లక్షలు పరిహారం చెల్లించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

‘ప్రస్తుత నాగరిక సమాజంలో కస్టోడియల్‌ మరణం అనేది అత్యంత దారుణమైన నేరాల్లో ఒకటి. పౌరుల చర్యలు, నేరాలను నియంత్రించే అధికారం పోలీసులకు ఉన్నప్పటికీ.. అది అపరిమితమైనది కాదు. అధికారం చెలాయించాలనే నెపంతో పౌరులతో అమానవీయంగా ప్రవర్తించడం, చిత్రహింసలకు గురిచేయడం సరికాదు. పౌరుల జీవితానికి రక్షణ కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. అధికారం ముసుగులో ఆ ప్రభుత్వ ఉద్యోగి పౌరులపై చిత్రహింసలకు పాల్పడితే.. అటువంటి పౌరులకు పరిహారం చెల్లించాల్సిందే’ అని బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్‌ ధర్మాసనం తీర్పు వెలువరించింది. అయితే, ఈ పరిహారాన్ని ముద్దాయిల (యువకుడి మృతికి కారణమైన ఇద్దరు పోలీసులు) నుంచి వసూలు చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని చెప్పింది. ఇక ప్రదీప్‌ నడుపుతోన్న ట్రాక్టర్‌ను పోలీసులు అడ్డుకోవడం సబబుకాదనే చెప్పాలి. ఒకవేళ పాటల శబ్దం గురించి ఏదైనా అభ్యంతరం ఉంటే అతడికి సౌమ్యంగా చెప్పాల్సి ఉండేది అని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.

మహారాష్ట్రకు చెందిన చెరకు రైతు కుటుంబానికి చెందిన ప్రదీప్(23)‌.. 2018 నవంబరులో ట్రాక్టరుపై వెళ్తోన్న సమయంలో పోలీసులు అతన్ని ఆపారు. ట్రాక్టర్‌లో పాటల శబ్దం ఎక్కువగా పెట్టాడనే నెపంతో అతనిపై దాడికి దిగారు. వాహనంపై ఉన్న వారందరూ తప్పించుకోగా.. ప్రదీప్‌ మాత్రం అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తన కుమారుడు.. పోలీసులు చిత్రహింసల వల్లే చనిపోయాడంటూ బాధితుడి తల్లి సునీత అక్కడి హైకోర్టును ఆశ్రయించింది. తన కుమారుడి మరణానికి కారణమైన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు రూ.40 లక్షల పరిహారం చెల్లించాలని అభ్యర్థించింది. విచారణ చేపట్టిన ఔరంగాబాద్‌ ధర్మాసనం పోలీసుల తీరుపై తీవ్రంగా తప్పుపట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని