Tauktae: కర్ణాటకలో నలుగురు, కేరళలో ఇద్దరి మృతి 

తౌక్టే తుపాను బీభత్సం సృష్టిస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం

Updated : 16 May 2021 14:06 IST

దిల్లీ :  తౌక్టే తుపాను తీవ్రరూపం  దాల్చింది. ఇది ఈ నెల 18న మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.30 గంటల సమయంలో గుజరాత్‌లోని పోర్‌బందర్‌-నలియాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరం దాటేప్పుడు 150-175 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని.. తుపాను కారణంగా మంగళవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ‘తౌక్టే’ తుపాను ప్రస్తుతం ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తోంది. ఇవాళ మధ్యాహ్నం తర్వాత గోవాకు ఉత్తర వాయువ్యంలో కేంద్రీకృతం కానుంది.

కర్ణాటక తీరాన్ని తౌక్టే తాకింది. తుపాను ప్రభావంతో కర్ణాటకలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. గత 24 గంటల్లో 6 జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వర్షాలు, వరదల కారణంగా నలుగురు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. దాదాపు 73 గ్రామాలపై తౌక్టే తుపాను ప్రభావం ఉన్నట్లు చెప్పారు.

కేరళ రాష్ట్రాన్ని తుపాను వణికిస్తోంది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో వాతావరణ విభాగం ‘రెడ్‌ అలర్ట్‌’ ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా ఇద్దరు మృతి చెందారు. ఉత్తర జిల్లాలైన మల్లాపురం, కొళికోడ్‌, వయనాడ్‌, కన్నూర్‌, కాసర్‌గోడ్‌ల్లో తీవ్రత అధికంగా ఉంది. అళప్పుళ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం, త్రిస్సూర్‌, పాలక్కాడ్‌ జిల్లాల్లోనూ ప్రభావం కనిపించింది. తీర ప్రాంతాల్లో సముద్రం ఆకస్మికంగా ముందుకురావడంతో జనజీవనం స్తంభించింది. వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. చెట్లు విరిగిపోవడంతో చాలా ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ప్రధాన నదులైన మీనాచిల్‌, అచన్‌కోవిల్‌, మణిమాలల్లో  నీటి ప్రవాహం పెరుగుతోంది. ఇడుక్కి జిల్లాలోని కల్లార్‌కుట్టి, మాలాంకర, భూతథంకెట్టు ఆనకట్టలు, పధనంథిట్ట జిల్లాలోని మణియార్‌ ఆనకట్టల గేట్లను ఎత్తివేశారు. చెట్లు విరిగి ఇళ్లు, వాహనాలపై పడడంతో ఇడుక్కి జిల్లాలోని మున్నార్‌-వత్తవాడ మార్గంలో చాలాసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

తుపాను ప్రభావిత రాష్ట్రల సీఎంలతో అమిత్‌ షా సమీక్ష
తౌక్టే తుపాను ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సమీక్ష చేపట్టారు. వర్చువల్‌గా సీఎంలతో సమావేశమై.. తుపాను ప్రభావం, అందుతున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు