Kerala: ఊపిరి పీల్చుకుంటున్న కేరళ.. రోజువారీ కేసుల్లో తగ్గుదల!

మొన్నటివరకు నిత్యం 50వేల కేసులు నమోదైన కేరళలో.. ప్రస్తుతం రోజువారీ కేసుల సంఖ్య 26వేలకు తగ్గింది.

Published : 07 Feb 2022 01:46 IST

తిరువనంతపురం: కొవిడ్‌ తీవ్రతతో వణికిపోతున్న కేరళలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నట్లు కనిపిస్తున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. మొన్నటివరకు నిత్యం 50వేల కేసులు నమోదైన కేరళలో.. ప్రస్తుతం రోజువారీ కేసుల సంఖ్య 26వేలకు తగ్గింది. ఆదివారం నాడు అక్కడ 26,729 కేసులు నమోదయ్యాయి. మరో 22 మంది మృతి చెందడంతో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 58,255కు చేరింది. వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్న కేరళలోనూ కొవిడ్‌-19 ఉద్ధృతి క్రమంగా తగ్గుతుండడం ఊరట కలిగించే విషయం.

గతకొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కొవిడ్‌-19 తీవ్రత తగ్గుతున్నప్పటికీ కేరళలో మాత్రం గతవారం వరకూ నిత్యం 50వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కాగా ఈ వారంలో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం 38,684 కేసులు నమోదుకాగా శనివారం 33వేలకు తగ్గాయి. తాజాగా ఆదివారం నాటికి ఈ సంఖ్య 26వేలకు తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3లక్షల 29వేల క్రియాశీల కేసులు ఉన్నట్లు కేరళ ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 3శాతం బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. గడిచిన 24గంటల్లో ఎర్నాకులంలో అత్యధికంగా 3989 కేసులు నమోదు కాగా తిరువనంతపురంలో 3564 కేసులు, త్రిస్సూర్‌లో 2554 కేసులు నమోదైనట్లు కేరళ ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇదిలా ఉంటే, భారత్‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. ఆదివారం ఉదయం నాటికి కొత్తగా 1,07,474 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే రోజువారీ కేసుల్లో 16 శాతం తగ్గుముఖం పట్టాయి. పాజిటివిటీ రేటు 7.42 శాతానికి పడిపోయింది. క్రియాశీలక కేసుల సంఖ్య 2.90శాతంగా ఉంది. రికవరీ రేటు 95.91 శాతంగా నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని