US: ఆ రసాయనం వల్ల.. అమెరికాలో ఏటా లక్ష మరణాలు..!

నిత్యావసర వస్తువుల తయారీలో సర్వసాధారణంగా ఉపయోగించే థాలెట్స్‌ అనే రసాయనాలు మానవాళికి ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ రసాయనాల వల్ల అమెరికాలో

Updated : 13 Oct 2021 16:10 IST

(ప్రతీకాత్మక చిత్రం)

న్యూయార్క్‌: నిత్యావసర వస్తువుల తయారీలో సర్వసాధారణంగా ఉపయోగించే థాలెట్స్‌ అనే రసాయనాలు మానవాళికి ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ రసాయనాల వల్ల అమెరికాలో ఏటా లక్ష మరణాలు చోటుచేసుకుంటున్నట్లు న్యూయార్క్‌ యూనివర్శిటీ తాజా అధ్యయనంలో వెల్లడించింది. 

పిల్లలు ఆడుకునే బొమ్మల నుంచి దుస్తులు, షాంపూల వరకు నిత్య జీవితంలో ఉపయోగించే అనేక ప్లాస్టిక్‌ వస్తువుల తయారీలో ఈ థాలెట్స్‌ను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఆ వస్తువుల నుంచి విషపూరిత రసాయనాలు మన శరీరంలోకి ప్రవేశించి హార్మోన్లు, ఎండోక్రైన్‌ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని ఈ అధ్యయనం తెలిపింది. ఈ అంశంపై న్యూయార్క్‌ యూనివర్శిటీ ఇటీవల 55 నుంచి 64ఏళ్ల మధ్య వయసు గల 5000 మందిపై పరిశోధనలు చేసింది. వారి మూత్రంలో అత్యధిక మోతాదులో థాలెట్స్‌ రసాయనాలు ఉన్నట్లు గుర్తించింది. ఈ రసాయనాల వల్ల వీరంతా గుండె సంబంధిత వ్యాధులతో చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 

‘‘థాలెట్స్‌ రసాయనాల వల్ల మనిషి ప్రాణాలు పోతాయని నేరుగా చెప్పలేం. అయితే ఈ రసాయనాల వల్ల గుండె సంబంధిత వ్యాధుల ముప్పు అధికంగా ఉంది. గుండె సమస్యలు మరణాలకు ప్రధాన కారణంగా మారుతున్నాయి’’ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ థాలెట్స్‌  ఊహించినదాని కంటే ఎక్కువ ప్రమాదకరమైనవని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఈ థాలెట్స్‌ రసాయనాల వల్ల అమెరికాలో చాలా మంది అనేక వ్యాధుల బారినపడుతున్నారని, దీని కారణంగా ఏడాదికి లక్ష మరణాలు చోటుచేసుకుంటున్నాయని అధ్యయనం వెల్లడించింది. ఇక దీని కారణంగా పురుషుల్లో టెస్టోస్టిరాన్‌ స్థాయి తగ్గే అవకాశముందని గతంలోనూ అనేక అధ్యయనాలు వెల్లడించాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని