70ఏళ్లలో తొలిసారి.. ఆ గుడిలో అడుగుపెట్టిన దళితులు

ఏడు దశాబ్దాల్లో తొలిసారి గ్రామ ఆలయంలోకి దళితులకు ప్రవేశం లభించింది. గ్రామానికి చెందిన కొన్ని వర్గాల వారు దళితుల ప్రవేశాన్ని అడ్డుకోవడంతో ఇన్నేళ్లు వారు ఆలయానికి దూరంగా ఉన్నారు. తాజాగా జిల్లా అధికారులు చొరవ చూపి చర్చలు జరపడంతో.. 70ఏళ్లలో తొలిసారి ఆ గ్రామానికి చెందిన దళితులు అక్కడి ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారిని దర్శించుకున్నారు.

Published : 30 Jan 2023 21:43 IST

తిరువణ్ణామలై: సమాజంలో భిన్న వర్గాలు, కులాల మధ్య అంతరం తగ్గుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. ఆధునిక యుగంలోనూ అంటరానితనం జాడలు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తమిళనాడులో ఓ గ్రామంలోని దేవాలయంలోకి దళితులకు అనుమతి లేదట. ఇటీవల జిల్లా అధికారులు ఉన్నత వర్గాలతో శాంతి చర్చలు జరిపారు. ఇవి ఫలించడంతో 70 ఏళ్లలో తొలిసారిగా ఆ గ్రామంలోని దళితులు దేవాలయంలోకి అడుగుపెట్టిన ఘటన తమిళనాడులోని తిరువణ్ణామలైలో చోటుచేసుకుంది.

ఉత్తర తిరువణ్ణామలై జిల్లా తాండ్రంపట్టు తాలుకాలోని తెన్‌ముడియానూర్‌ గ్రామంలో ముత్తుమరియమ్మన్‌ (శక్తి అమ్మవారు) అనే దేవాలయం ఉంది. సుమారు 70-80 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు. ఏటా పదిహేను రోజులపాటు సాగే పొంగల్‌ వేడుకల్లో ఒక్కో వర్గానికి చెందిన ప్రజలు ఒక్కోరోజు పూజలు నిర్వహిస్తారు. అమ్మవారికి ప్రత్యేక నైవేద్యం సమర్పించి తమ భక్తిని చాటుకుంటారు. కానీ, ఆలయంలోకి ఆ గ్రామానికి చెందిన దళితులు మాత్రం ఎన్నడూ వెళ్లలేదట. ఈసారి తాము దర్శించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ జిల్లా అధికారులను ఆశ్రయించారు.

దీంతో చర్యలు చేపట్టిన జిల్లా యంత్రాంగం.. రెవెన్యూ, పోలీసు అధికారులను రంగంలోకి దింపింది. ఆ గ్రామంలోని ఉన్నతవర్గాలతో చర్చలు జరిపి భారత రాజ్యాంగం ముందు అందరూ సమానమేనని.. ఎవ్వరిపైనా వివక్ష ఉండకూడదనే విషయాన్ని స్పష్టం చేసింది. సున్నితమైన విషయం కావడంతో శాంతియుతంగా చర్చలు జరిపి దళితులను ఆలయంలోకి వెళ్లేందుకు ఇతర వర్గాల వారిని ఒప్పించామని జిల్లా కలెక్టర్‌ మురుగేశ్‌ వెల్లడించారు. దీంతో జనవరి 30న ఆలయంలోకి స్థానిక దళితులు వెళ్లి పూజలు నిర్వహించారని చెప్పారు.

ఏడు దశాబ్దాల తర్వాత దళితులు ఆ గుడిలోకి అడుపెడుతుండటంతో ఆ ప్రాంతంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత కల్పించారు. వెల్లూరు రేంజీ డీఐజీతోపాటు తిరువణ్ణామలై ఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. అయితే, అధికారుల చొరవతో తొలిసారి ఆలయంలోకి అడుగుపెట్టడం ఎంతో సంతోషంగా ఉందని స్థానిక దళితులు ఆనందం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు