8 నుంచి 80 ఏళ్ల వరకు.. ఏ మహిళనీ వదల్లేదు!

చరిత్రలో రెండో ప్రపంచ యుద్ధానికి ప్రత్యేక స్థానముంది. 1939లో పోలెండ్‌పై జర్మనీ చేసిన దాడితో ప్రారంభమైన ఈ యుద్ధం 1945లో జర్మనీ రాజధాని బెర్లిన్‌ నగరాన్ని సోవియట్‌ యూనియన్‌ ఆక్రమించుకోవడం, హిట్లర్‌ ఆత్మహత్యతో ముగుస్తుంది...

Published : 19 Jun 2021 01:14 IST

రెండో ప్రపంచ యుద్ధంలో చీకటి కోణం

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

చరిత్రలో రెండో ప్రపంచ యుద్ధానికి ప్రత్యేక స్థానముంది. 1939లో పోలెండ్‌పై జర్మనీ చేసిన దాడితో ప్రారంభమైన ఈ యుద్ధం, 1945లో జర్మనీ రాజధాని బెర్లిన్‌ నగరాన్ని సోవియట్‌ యూనియన్‌ ఆక్రమించుకోవడం, హిట్లర్‌ ఆత్మహత్యతో ముగిసింది. దాదాపు ఆరేళ్ల పాటు సాగిన ఈ సుదీర్ఘ సమరంలో ప్రపంచం ఆర్థికంగా ఎంతో నష్టపోయింది. అయితే రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్‌ను విలన్‌గా చెప్తుంటారు. యుద్ధానికి జర్మనీ కారణమనీ అంటుంటారు. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. యుద్ధం చివరి రోజుల్లో రష్యా సైన్యం పాశవిక చేష్టలకు బెర్లిన్‌ నగరం చిగురుటాకులా వణికిపోయిందన్న సంగతి కొంతమందికి మాత్రమే తెలుసు.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ, జపాన్‌, ఇటలీ అక్షరాజ్య కూటమిని ఏర్పాటు చేయగా.. సోవియట్‌ రష్యా, ప్రాన్స్‌, బ్రిటన్‌, చైనా, పోలెండ్‌ తదితర దేశాలన్నీ మిత్రపక్ష కూటమిగా ఏర్పడ్డాయి. యుద్ధం ముగింపు దశలో అమెరికా కూడా మిత్ర రాజ్యాల సరసన చేరింది. యుద్ధం తొలినాళ్లలో విజయం జర్మనీ పక్షం ఉన్నప్పటికీ.. 1944కి వచ్చే సరికి పూర్తిగా మిత్ర రాజ్యాలవైపు మొగ్గింది. సోవియట్‌ సేనలు అప్రతిహత విజయాలను సాధిస్తూ జర్మన్‌ దళాలను రష్యా నుంచి పారదోలడమే కాకుండా పోలెండ్‌, రుమేనియాలోకి చొచ్చుకుపోయాయి. 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. ఆ ఏడాది మొదటి నెలల్లో జర్మనీ చివరిసారిగా మిత్ర రాజ్యాల సేనలపై చేసిన ఎదురుదాడులు పూర్తిగా విఫలమయ్యాయి. అదే ఏడాది మే నెలలో సోవియట్‌ సేనలు జర్మనీ రాజధాని బెర్లిన్‌ను ఆక్రమించుకునేందుకు ప్రయత్నించి సఫలమయ్యాయి. ఈ క్రమంలోనే ప్రపంచం తలదించుకునే ఘటనలు చోటు చేసుకున్నాయి.

ఎవర్నీ వదల్లేదు..!

జర్మనీ మహిళలు, చిన్నారులపై రష్యా సేనలు పాశవిక చర్యలకు పాల్పడ్డాయి. 8 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు ఎవరు కనిపించినా వదల్లేదు. యుద్ధంలో తమ భర్తను కోల్పోయిన మహిళలు కనీసం తమ నగరాన్నయినా కాపాడుకునేందుకు సోవియట్‌ సేనలపై ఎదురు తిరిగారు. వారి తిరుగుబాటును రష్యా సైన్యం ఉక్కుపాదంతో అణిచివేసింది. అంతేకాకుండా వారిని బలాత్కరించి కీచకానందం పొందింది. అయితే ఈ ఘటనలను అప్పట్లో రష్యా మీడియా కొట్టిపారేసింది. అదంతా బూటకమే అని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఉక్రెయిన్‌కు చెందిన వ్లాదిమిర్‌ జెల్ఫాండ్‌ అనే లెఫ్టినెంట్‌ తన డైరీలో రాసుకొచ్చిన విషయాలు జర్మన్‌ మహిళలు ఎదుర్కొన్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఆయన కూడా రష్యన్‌ సైన్యంలో ఓ అధికారి. అప్పట్లో సైనికులు డైరీ రాయడంపై సోవియట్‌ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. యుద్ధానికి సంబంధించిన ఎలాంటి అంశాలను అందులో రాయకూడదు. కానీ, వ్లాదిమిర్‌ జెల్ఫాండ్‌ మాత్రం రహస్యంగా తన డైరీలో 16 ఏప్రిల్‌ 1945 నుంచి 2 మే 1945 వరకు బెర్లిన్‌ నగరాన్ని ఆక్రమించుకునే క్రమంలో ఏం జరిగిందో తన డైరీలో రాసుకొచ్చాడు.

ఐదు వేల మంది సైనికులు

మొత్తం 80 వేల మంది సైనికులున్న స్టాలిన్‌ నేతృత్వంలోని సోవియట్‌ సేనల్లో దాదాపు 5000 మంది బెర్లిన్ నగరాన్ని ఆక్రమించుకునేందుకు వచ్చారు. అప్పటికే యుద్ధంలో తమ భర్తలను కోల్పోయిన చాలా మంది మహిళలు వారితో పోరాడేందుకు సమర శంఖం పూరించారు. కానీ, సోవియట్‌ సేనల ముందు నిలవలేకపోయారు. ఈ క్రమంలోనే సోవియట్‌ సైనికులు వికృత చేష్టలకు పాల్పడ్డారు. మహిళలని కూడా చూడకుండా అత్యంత కర్కశంగా వ్యవహరించారు. యుద్ధనీతిని మరచిపోయి వారిపై పాశవిక చర్యలకు పాల్పడ్డారు. దొరికిన మహిళను దొరికినట్టుగా అత్యాచారం చేశారు. కేవలం తమను ప్రతిఘటించిన మహిళలపైనే కాదు.. బెర్లిన్‌ వీధుల్లో తిరుగుతూ చిన్నాపెద్దా అని చూడకుండా వికృత చర్యలకు పాల్పడ్డారు. కన్నకూతుళ్లను తల్లుల ముందే చెరబట్టారు. దీంతో ఓ వైపు భర్తను కోల్పోయి, మరోవైపు కూతుళ్లను కాపాడుకోలేని తల్లుల ఆవేదనలతో బెర్లిన్‌ నగరం చిగురుటాకులా వణికిపోయింది.

ఓ పక్క భయం..మరోవైపు ఆవేదన

అది ఏప్రిల్‌ 25, 1945 జెల్ఫాండ్‌ ఓ సైకిల్‌పై బెర్లిన్‌ నగర శివారులోని ఓ ఆనకట్ట దగ్గరకు వచ్చారు. కొంతమంది జర్మన్‌ మహిళలు పెట్టేబేడా సర్దుకుంటూ నగరం దాటి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతలో జెల్ఫాండ్‌ను చూసి ఆగిపోయారు. ఎందుకు నగరాన్ని విడిచి వెళ్లిపోతున్నారని జెల్ఫాండ్‌ వారిని ప్రశ్నించారు. ఒక్కసారిగా వారి మొహాల్లో భయం ఆవహించింది. ఆయన రెట్టించి అడిగే సరికి.. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో, రష్యా సైనికుల పశువాంఛకు తామెలా బలైపోయారో వివరించారు. దాదాపు 20 మంది తనపై అత్యాచారానికి ఒడిగట్టినట్లుగా అందులో ఓ యువతి జెల్ఫాండ్‌తో చెప్పింది. తన కళ్ల ముందే కన్నకూతుర్ని బలాత్కరించారంటూ ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతలో మరో యువతి ఆయన ముందుకెళ్లి.. ‘‘ మీరు ఇక్కడే ఉండండి.. నా పక్కన పడుకోండి. మీకేం కావాలంటే అది చేసుకోండి.. కానీ మీరొక్కరే చేయండి’’ అంటూ ఓ పక్క భయంతో, మరోవైపు ఆవేదనతో చెప్పిందంటే వాళ్ల మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే జర్మన్‌ మహిళలపై సోవియట్‌ సేనల దురాగతాలు ఉన్నతాధికారులకు, రష్యా అధిష్ఠానానికి తెలిసే జరిగాయా అన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.

ఆధారాల్లేవ్‌!

జర్మన్‌ మహిళలపై సోవియట్‌ సేనల దురాగతాలకు సంబంధించి కచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ.. కొన్ని నిర్జీవ సాక్ష్యాలు మాత్రం బెర్లిన్‌ నగరంలోని జర్మన్‌-రష్యన్‌ మ్యూజియంలో దొరికాయి. ఓ జర్మన్‌ సైనికుడి వ్యక్తిగత ఆల్బమ్‌ నుంచి సేకరించిన ఓ ఫొటోను అందులో భద్రపరిచారు. వివస్త్ర అయిన ఓ మహిళ కటిక నేలపై అచేతనంగా పడి ఉన్నట్లు ఓ ఫొటోను చూస్తే.. ఆమెపై ఎవరో అత్యాచారానికి పాల్పడినట్లు సులువుగానే గుర్తు పట్టవచ్చు.

బాధితులు లక్ష మందికిపైగానే..!

కేవలం జల్ఫాండ్‌ మాత్రమే కాదు.. గుర్తుతెలియని చాలామంది వ్యక్తులు ఆనాటి దురాగతాలను తమ డైరీల్లో రాసుకొచ్చారు. అయితే  బెర్లిన్‌ నగరంలో ఎంతమందిపై అత్యాచారం చేసి ఉంటారనే ప్రశ్నకు సమాధానం వింటే ఆశ్చర్యపోక తప్పదు. కొన్ని మెడికల్‌ రికార్డుల ప్రకారం కేవలం బెర్లిన్‌ నగరంలోనే లక్ష మందికిపైగా మహిళలు రష్యా సైనికుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం జర్మనీ దేశంలో ఈ సంఖ్య రెండు మిలియన్లకు పైమాటే. జర్మనీ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 218 ప్రకారం గర్భస్రావాలు నిషేధం. కానీ, 1945లో మూకుమ్మడి అత్యాచారాల నేపథ్యంలో అప్పట్లో అక్కడ కొంత వెసులుబాటు కల్పించినట్లు చెబుతుంటారు. మూకుమ్మడి అత్యాచారాలపై 1945-1946 మధ్య కాలంలో బెర్లిన్‌ కోర్టులో 995 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో రష్యా ఓ నూతన చట్టాన్ని తీసుకొచ్చింది. రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా విజయాన్నిగాని, సోవియట్‌ సైనికుల పరాక్రమాలనుగాని కించపరచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, కనీసం 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది.

‘‘రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సోవియట్‌ యూనియన్‌ సైనికులు చూపించిన వీరోచిత పోరాట పటిమను తక్కువ చేయలేం.  వారి ధైర్యసాహసాలను కొట్టి పారేయలేం. కానీ ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. అందరికీ తెలిసిన దాన్నే నిజమని భ్రమపడకూడదు’’ అని జెల్ఫాండ్‌ తనయుడు విటలీ జెల్ఫాండ్ ఇటీవల ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని