Darshan: దర్శన్‌ మేనేజర్ ఆత్మహత్య..!

ఇప్పటికే అభిమానిని హత్య చేసిన కేసులో ఇరుక్కొని దర్శన్ (Darshan) చిక్కుల్లో పడగా.. ఇప్పుడు ఆయన మేనేజర్ ఒకరు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. 

Updated : 18 Jun 2024 17:52 IST

(దర్శన్‌)

బెంగళూరు: నటి పవిత్రగౌడకు అసభ్య సందేశాలు పంపినందుకు రేణుకాస్వామి అనే యువకుడిని హత్య చేశారనే ఆరోపణలపై కన్నడ చలనచిత్ర నటుడు దర్శన్‌ తూగుదీప (Darshan) అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసు కన్నడనాట సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. మంగళవారం దర్శన్ మేనేజర్ శ్రీధర్‌ ఆత్మహత్య చేసుకున్నాడని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

బెంగళూరులోని దర్శన్ ఫామ్‌హౌస్‌లో ఈ ఘటన జరిగిందని వెల్లడించాయి. మృతదేహంతో పాటు ఒక సూసైడ్‌నోట్‌, ఒక వీడియో సందేశాన్ని గుర్తించినట్లు తెలిపాయి. ఒంటరితనం వేధించడం వల్లే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆ లేఖలో, వీడియోలో శ్రీధర్ పేర్కొన్నారు. తన చావుకు ఎవరూ కారణం కాదని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ అరెస్టయిన తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

పవిత్రా గౌడ, దర్శన్‌ పదేళ్లుగా సహజీవనంలో ఉన్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దర్శన్‌కు ఇదివరకే విజయలక్ష్మితో పెళ్లి కావడంతో ఆ ముగ్గురి మధ్య గొడవలు జరుగుతున్నాయని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో తన అభిమాన హీరో వ్యక్తిగత జీవితంలో పవిత్ర చిచ్చుపెట్టారని దర్శన్‌ అభిమాని, చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి (28) ఆగ్రహంతో ఉండేవాడు. అందులోభాగంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాకు అశ్లీల సందేశాలు పంపుతూ దూషిస్తూ వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలోనే అతడి హత్య జరిగింది. ఈ కేసులో మొత్తం 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు