Darshan: డయేరియాతో బాధపడుతున్నా.. ఇంటి ఆహారానికి అనుమతివ్వండి - దర్శన్‌

విచారణ ఖైదీగా ఉన్న తనకు కారాగారంలో ఇస్తున్న ఆహారం జీర్ణం కావడం లేదని, అందుకే ఇంటి నుంచి భోజనాన్ని తెప్పించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ కర్ణాటక హైకోర్టులో దర్శన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

Published : 10 Jul 2024 21:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అభిమాని హత్య కేసులో నిందితుడైన కన్నడ నటుడు దర్శన్‌కు జైలు ఆహారం పడటం లేదట. జైలు ఆహారంతో భారీగా బరువు తగ్గడంతోపాటు డయేరియా వంటి సమస్యలు వస్తున్నాయని, అందుకే ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు అనుమతి ఇవ్వాలని పేర్కొంటూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన న్యాయస్థానం.. నిబంధనలు అందరికీ ఒకే విధంగా ఉంటాయని, ఈ కేసును అలాగే పరిగణిస్తామని స్పష్టం చేసింది.

 కారాగారంలో ఇస్తున్న ఆహారం జీర్ణం కావడం లేదని, అందుకే ఇంటి నుంచి భోజనాన్ని తెప్పించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ కర్ణాటక హైకోర్టులో దర్శన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఓ మంచం, పుస్తకాలు కూడా కావాలని అందులో అభ్యర్థించారు. దీనిని జస్టిస్‌ ఎస్‌ఆర్‌ కృష్ణకుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. విచారణ ఖైదీలకు, దోషులకు జైలు నిబంధనలు ఉన్నాయని, వాటికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. తదుపరి విచారణను జులై 11కు వాయిదా వేసిన న్యాయస్థానం.. ఈ విషయంలో ఇతర కోర్టులు ఇచ్చిన ఆదేశాలను తెలియజేయాలని కోరింది. 

జైల్లో ఇచ్చే ఉప్మా, అన్నం, సాంబారు, రాగిముద్ద, మజ్జిగ వంటివి సరిపోవడం లేదని, తన బరువు గణనీయంగా తగ్గిపోతోందని దర్శన్‌ వాపోయాడు. దర్శన్‌కు నిత్యం మాంసాహారం తీసుకోవడం అలవాటు ఉందని, కారాగారంలో వారంలో రెండు రోజుల మాత్రమే మాంసాహారాన్ని ఇవ్వడం, అదీ పరిమితిలో ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని అతని భార్య విజయలక్ష్మి పేర్కొనడం గమనార్హం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని