Darshan: దర్శన్ మాజీ మేనేజర్ అదృశ్యం.. 8 ఏళ్లుగా వీడని మిస్టరీ..!

ఓ అభిమాని హత్య కేసులో దర్శన్ (Darshan) అరెస్టయిన దగ్గరి నుంచి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పుడు మాజీ మేనేజర్ అదృశ్యం గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. 

Updated : 19 Jun 2024 11:28 IST

దిల్లీ: అభిమానిని హత్య చేశారనే ఆరోపణలపై ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తూగుదీప (Darshan) అరెస్టయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మంగళవారం ఆయన మేనేజర్ ఆత్మహత్య గురించి వార్త రాగా.. తాజాగా ఆయన మాజీ మేనేజర్‌ మల్లికార్జున్‌కు సంబంధించిన మరో విషయం చర్చనీయాంశంగా మారింది. ఎనిమిదేళ్ల క్రితం అదృశ్యమైన అతడి జాడ ఇప్పటికీ మిస్టరీనే. జాతీయ మీడియా కథనాల ప్రకారం..

కర్ణాటకలోని గడగ్‌ జిల్లాకు చెందిన మల్లికార్జున్‌.. దర్శన్ వద్ద మేనేజర్‌గా పనిచేశారు. నటుడి సినిమా షెడ్యూళ్లు, ఇతర పనులను చూసుకునేవారు. తర్వాత కాలంలో సినిమాలు నిర్మించడం, డిస్ట్రిబ్యూట్ చేయడం వంటివి చేశారు. ఈ క్రమంలోనే నష్టాల్లోకి జారుకున్నారు. అతడికి అప్పు ఇచ్చినవారిలో మరో ప్రముఖ నటుడు అర్జున్‌ సర్జా కూడా ఉన్నారు. ఆయన కోటి రూపాయలు అప్పు ఇచ్చినట్లు సమాచారం. తానిచ్చిన డబ్బును తిరిగి చెల్లించాలంటూ అర్జున్ కేసు పెట్టారు. మరోవైపు దర్శన్‌కు చెందిన రూ.2 కోట్లను అక్రమంగా వినియోగించుకున్నారని తెలుస్తోంది. ఈ పరిస్థితుల మధ్య 2016లో అతడు కనిపించకుండా పోయారు. పోలీసులు అతడి కోసం గాలించినా..ఇంతవరకు జాడ దొరకలేదు. ఈ వ్యవహారంలో దర్శన్‌ కుటుంబం మౌనంగా ఉండటం కూడా పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ పరిణామాలతో నటుడు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

దర్శన్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

పవిత్రా గౌడ, దర్శన్‌ పదేళ్లుగా సహజీవనంలో ఉన్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దర్శన్‌కు ఇదివరకే విజయలక్ష్మితో పెళ్లి కావడంతో ఆ ముగ్గురి మధ్య గొడవలు జరుగుతున్నాయని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో తన అభిమాన హీరో వ్యక్తిగత జీవితంలో పవిత్ర చిచ్చుపెట్టారని దర్శన్‌ అభిమాని, చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి ఆగ్రహంతో ఉండేవాడు. అందులోభాగంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాకు అశ్లీల సందేశాలు పంపుతూ దూషిస్తూ వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలోనే అతడి హత్య జరిగింది. ఈ కేసులో మొత్తం 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని