Pavithra Gowda: పవిత్రా గౌడ కళ్లముందే చిత్రహింసలు.. దర్శన్‌ కేసులో కొత్త విషయాలు

రేణుకాస్వామికి కరెంటు షాక్‌ ఇచ్చి చిత్ర హింసలు పెడుతున్న సమయంలో పవిత్రా గౌడ ఘటనా స్థలంలోనే ఉన్నారని తాజాగా వెల్లడైంది.

Published : 22 Jun 2024 00:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కన్నడ నటుడు దర్శన్‌ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. హత్యకు ముందు అతడికి కరెంటు షాక్‌ ఇచ్చి చిత్ర హింసలు పెట్టారనే విషయం తెలిసిందే. ఆ సమయంలో పవిత్రా గౌడ ఘటనా స్థలంలోనే ఉన్నారని తాజాగా వెల్లడైంది. వాటిని ఆమె కళ్లారా చూశారని పోలీసుల విచారణలో తేలింది.

జూన్‌ 8న రేణుకాస్వామిని చిత్రదుర్గలో అపహరించిన కొందరు దుండగులు..అనంతరం బెంగళూరుకు తీసుకెళ్లారు. పట్టణగెరెలో ఉన్న ఓ షెడ్డులో బాధితుడిని చిత్రహింసలకు గురిచేశారు. తాను శాకాహారినని చెప్పినా, బలవంతంగా బిర్యానీ, ఎముకను నోట్లో పెట్టి తినిపించి వేధించారు. అనంతరం అతడిపై కర్రలతో దాడి చేసి, పలుమార్లు కరెంటు షాక్‌ ఇచ్చి చిత్రహింసలు పెట్టారు. ఆ సమయంలో పవిత్రా గౌడ కొద్దిసేపు అక్కడే ఉన్నారని.. దర్శన్‌ అతడిని కొట్టడాన్ని కళ్లారా చూశారని తెలిసింది.

శరీరంపై అనేక చోట్ల గాయాలు ఉండడం, తీవ్ర రక్తస్రావంతోనే రేణుకాస్వామి మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. మర్మావయవాలు పూర్తిగా దెబ్బతినడంతోపాటు ఒక చెవి కూడా కనిపించలేదని తేలింది. మరోవైపు రేణుకాస్వామి హత్య అనంతరం అతడి మృతదేహాన్ని మాయం చేసేందుకు రూ.50లక్షల వరకు దర్శన్‌ ఖర్చు పెట్టినట్లు సమాచారం. మొత్తంగా కిడ్నాప్‌, హత్య వ్యవహారాన్ని చూసుకున్న ప్రదోష్‌ అనే వ్యక్తికి రూ.30లక్షలు, నేరాన్ని అంగీకరించేందుకు మరో ఇద్దరికి రూ.5లక్షల చొప్పున దర్శన్‌ చెల్లించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని