
Third wave: ఒమిక్రాన్ కారణంగానే దేశంలో థర్డ్ వేవ్
దిల్లీ: దేశంలో ఒమిక్రాన్ ఉద్ధృతి కొనసాగుతోంది. అయితే అన్ని రాష్ట్రాల్లో కేసులు పెరగడానికి ఈ వేరియంటే కారణమని నిపుణులు తాజాగా తేల్చారు. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వల్లే అన్ని రాష్ట్రాల్లో మూడోవేవ్ సంభవించిందని వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం వరకు పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో డెల్టానే ప్రధాన వేరియంట్‌గా ఉందని, కేవలం పశ్చిమ రాష్ట్రాల్లోనే ఒమిక్రాన్ తీవ్రంగా వ్యాపించిందని తెలిపారు. అయితే, తాజా గణాంకాల ప్రకారం.. అన్ని ఈశాన్య రాష్ట్రాల్లోనూ పెద్ద సంఖ్యలో ఒమిక్రాన్ కేసులు బయటపడుతున్నాయని అధికారులు వివరించారు. ‘వేంగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్ కారణంగానే అన్ని రాష్ట్రాల్లో కేసులు పెరిగిపోతున్నాయి. ఈ వేరియంటే మూడో వేవ్‌కు దారితీసింది’ అని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.
దేశంలో కరోనా కోరలు చాచింది. వరుసగా రెండో రోజూ కొత్త కేసులు లక్షన్నరకు చేరుకున్నాయి. శుక్రవారం 1,41,986 మందికి పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే ఇవి 21 శాతం ఎక్కువ. రోజువారీ పాజిటివిటీ రేటు 9.28 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, పశ్చిమ్ బెంగాల్, దిల్లీ, కర్ణాటక, తమిళనాడులో వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది. దేశంలో క్రియాశీల కేసులు ఐదు లక్షలకు సమీపించాయి.
ఇదిలా ఉంటే.. గత రెండు వారాల కొవిడ్ కేసులను విశ్లేషించిన ఐఐటీ మద్రాస్ బృందం తాజాగా కీలక విషయాలు వెల్లడించింది. కంప్యూటేషనల్ మోడలింగ్ ప్రాథమిక విశ్లేషణ ఆధారంగా.. దేశంలో ‘ఆర్నాట్’ విలువ డిసెంబర్ 25- 31 మధ్య 2.9 ఉండగా.. జనవరి 1-6 మధ్య ఏకంగా 4గా నమోదైందని తెలిపింది. దేశంలో మహమ్మారి రెండో వేవ్ పీక్ దశలో నమోదైన 1.69 కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. ఈ విలువ ఒకటి దాటడం ఏమాత్రం సానుకూల పరిణామం కాదని నిపుణులు పేర్కొంటున్నారు.