
Nasal Vaccine: ‘బూస్టర్ డోసు’ ప్రయోగాలకు భారత్ బయోటెక్‌కు అనుమతి..!
దిల్లీ: కొవిడ్-19ను నిరోధించేందుకు ముక్కుద్వారా తీసుకునే (BBV154) కొవాగ్జిన్ టీకాను భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. దీన్ని భారత్‌లో బూస్టర్ డోసుగా ఇచ్చేందుకుగానూ తుదిదశ ప్రయోగాలు జరిపేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI) అనుమతి ఇచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రదేశాల్లో వీటిని చేపట్టేందుకు భారత్ బయోటెక్ సిద్ధమైంది. ఇంట్రానాజల్ వ్యాక్సిన్లను అందించడం ఎంతో సులభమని.. కొవిడ్ వ్యాప్తిని అరికట్టడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని భారత్ బయోటెక్ పేర్కొంది. ఇక కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను బహిరంగ మార్కెట్లో అందుబాటులో వచ్చేందుకు అనుమతి వచ్చిన కొన్ని గంటల్లోనే బూస్టర్ డోసు ప్రయోగాలకూ అనుమతులు రావడం విశేషం.
కరోనా కొత్త వేరియంట్లు వెలుగు చూస్తోన్న వేళ బూస్టర్ డోసుతో వాటిని కట్టడి చేయవచ్చని అంతర్జాతీయంగా వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. ఇటు భారత్‌లోనూ కొవిడ్ ముప్పు అధికంగా ఉన్న వారికి ప్రికాషనరీ డోసు పేరుతో మూడో డోసును కేంద్ర ఆరోగ్యశాఖ పంపిణీ చేస్తోంది. ఇదే సమయంలో బూస్టర్ డోసును విస్తృతంగా పంపిణీ చేయాలంటే ఏ వ్యాక్సిన్‌ను ఇవ్వాలనే అంశంపై వ్యాక్సిన్ నిపుణుల కమిటీ దృష్టి సారించింది. ఇందుకోసం మూడోదశ ప్రయోగాలను తప్పనిసరిగా చేపట్టాలనే అభిప్రాయానికి వచ్చింది. ఇదే సమయంలో రెండు డోసుల టీకా తీసుకున్న వారికి తాము అభివృద్ధి చేసిన ఇంట్రానాజల్ టీకా బూస్టర్ డోసుగా అనువైనదని భారత్ బయోటెక్ ఇటీవలే వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ప్రయోగాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నెల క్రితమే డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. వాటిని పరిశీలించిన డీసీజీఐ.. తుది దశ ప్రయోగాలకు అనుమతి ఇచ్చింది.
ముక్కు ద్వారా తీసుకునే టీకా వల్ల శరీరంలోకి వైరస్ ప్రవేశించే మార్గంలోనే దానిని అడ్డుకోవచ్చని.. తద్వారా వైరస్ బారినపడకుండా కాపాడుకోవడమే కాకుండా ఇన్ఫెక్షన్, సంక్రమణ నుంచి పూర్తి రక్షణ పొందవచ్చని భారత్ బయోటెక్ వెల్లడించింది. భారీ ఎత్తున వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు ముక్కు ద్వారా తీసుకునే ఈ టీకా ఎంతో తేలికగా ఉంటుందని పేర్కొంది. ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ విస్తృత వేగంతో జరుగుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 95శాతం మంది అర్హులకు కనీసం ఒకడోసు అందగా.. 74శాతం మందికి పూర్తి మోతాదులో వ్యాక్సిన్ అందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.