Covaxin: 6-12 ఏళ్ల వారి కోసం కొవాగ్జిన్‌.. 5-12 ఏళ్ల వారికి కార్బెవాక్స్‌

దేశంలో టీకా పంపిణీని మరింత విస్తరిస్తూ చిన్న పిల్లలకు వ్యాక్సిన్‌ పంపిణీ చేసేందుకు మార్గం సుగమమైంది. ప్రముఖ ఫార్మా సంస్థ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకాను 6 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు

Published : 26 Apr 2022 14:08 IST

అత్యవసర అనుమతులు జారీ చేసిన డీసీజీఐ

దిల్లీ: దేశంలో టీకా పంపిణీని మరింత విస్తరిస్తూ చిన్న పిల్లలకు వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. ప్రముఖ ఫార్మా సంస్థ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకాను 6 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు ఇవ్వడానికి భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అత్యవసర అనుమతి మంజూరు చేసింది. దీంతో పాటు 5-12 ఏళ్ల వారికి బయోలాజికల్ - ఇ సంస్థ తయారు చేసిన కార్బెవాక్స్‌ టీకాను పంపిణీ చేసేందుకు డీసీజీఐ అనుమతులిచ్చింది. ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

కొవాగ్జిన్‌ టీకాను ఇప్పటికే 12 ఏళ్లు పైబడిన వారికి ఇస్తున్నారు. దీన్ని చిన్న పిల్లలకు సైతం ఇచ్చేందుకు అనుమతి కోరుతూ భారత బయోటెక్ గతంలో దరఖాస్తు చేసుకుంది. పిల్లలపై నిర్వహించిన క్లినికల్‌ పరీక్షల సమాచారాన్ని, సంబంధిత ఇతర వివరాలను అందజేసింది. అటు 5-12 ఏళ్ల వారికి కార్బెవాక్స్‌ టీకా పంపిణీ కోసం బయోలాజికల్ - ఇ సంస్థ కూడా దరఖాస్తు చేసుకొంది. వీటి సమాచారాన్ని, ప్రయోగ పరీక్షల ఫలితాలను విశ్లేషించేందుకు సబ్జెక్టు నిపుణుల కమిటీ (SEC) గత గురువారం భేటీ అయ్యింది. అనంతరం 6-12 ఏళ్ల చిన్నారులకు కొవాగ్జిన్‌ టీకాను, 5-12 ఏళ్ల వారికి కార్బెవాక్స్‌ టీకాను ఇచ్చేందుకు ఎస్‌ఈసీ.. డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI)కి సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనలను స్వీకరించిన డీసీజీఐ.. ఈ టీకాలకు నేడు అత్యవసర అనుమతులు జారీ చేసిసినట్లు మంగళవారం వెల్లడించింది.

ఇందుకు కొన్ని షరతులు విధించింది. టీకా పంపిణీ మొదలైన తర్వాత తొలి రెండు నెలల పాటు ప్రతి 15 రోజులకోసారి భద్రతా డేటాను అందజేయాలని ఆదేశించింది. ఆ తర్వాత 5 నెలల పాటు నెలకోసారి ఈ వివరాలను ఇవ్వాలని సూచించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా.. 5 ఏళ్లు పైబడిన పిల్లలకు ఇచ్చే టీకాలకు అత్యవసర అనుమతులు లభించిన నేపథ్యంలోనే త్వరలోనే ఈ వయసు వారికి వ్యాక్సిన్‌ పంపిణీపై కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయం ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయి.

12 ఏళ్లు పైబడిన వారికి జైకోవ్‌-డి..

ఇక 12 ఏళ్లు పైబడిన పిల్లలకు జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్‌-డి ఇచ్చేందుకు కూడా డీసీజీఐ అత్యవసర అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుతం 12-18ఏళ్ల వయసు వారి కోసం రెండు టీకాలు అందుబాటులో ఉన్నాయి. భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కొవాగ్జిన్‌ టీకాను 15 నుంచి 18 ఏళ్ల వయసువారికి పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటులోనూ ఇది అందుబాటులో ఉంది. 12-14 ఏళ్ల పిల్లలకు ఇస్తున్న కార్బెవాక్స్‌ మాత్రం ప్రస్తుతం ప్రభుత్వ కేంద్రాల్లోనే ఉందుబాటులో ఉంది. తాజా నిర్ణయంతో ఈ వయసు వారికి మూడో టీకా అందుబాటులోకి వచ్చినట్లయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని