DCW: అనుచితంగా ప్రవర్తించి.. కారుతో ఈడ్చుకెళ్లి.. మహిళా కమిషన్‌ చీఫ్‌కు భయానక అనుభవం!

దిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మాలివాల్‌తో ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. మహిళల భద్రత తనిఖీల్లో ఉన్న ఆమెపై కారు ఎక్కాలంటూ ఒత్తిడి తేవడమే కాకుండా, వాహనంతో కొద్ది దూరం లాక్కెళ్లడం గమనార్హం.

Updated : 19 Jan 2023 16:34 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ మహిళా కమిషన్‌‌(DCW) ఛైర్‌పర్సన్ స్వాతి మాలివాల్‌(Swati Maliwal)కు భయానక అనుభవం ఎదురైంది. మహిళల భద్రత(Women Security)పై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడుతుండగా.. ఓ వ్యక్తి ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా.. కారుతో ఆమెను కొద్ది దూరం ఈడ్చుకెళ్లడం గమనార్హం. దిల్లీ ఎయిమ్స్‌(AIIMS Delhi) సమీపంలో ఈ ఘటన జరిగింది. స్వాతి మాలివాల్‌ ఫిర్యాదు ప్రకారం.. గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆమె దిల్లీ వీధుల్లో మహిళల భద్రత పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో కారుతో వచ్చిన ఓ వ్యక్తి ఆమెను వాహనంలోకి ఎక్కాలంటూ ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించడంతో.. ముందుకెళ్లి యూటర్న్‌ తీసుకుని వచ్చి, మళ్లీ వేధింపులకు గురిచేశాడు.

దీంతో ఆమె అతన్ని పట్టుకునేందుకు యత్నించగా.. కారు అద్దం పైకి ఎక్కించి, చెయ్యి ఇరుక్కుపోయేలా చేశాడు. ఆపై దాదాపు 15 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లాడు. ఆ సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నట్లు స్వాతి మాలివాల్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘ఈ రోజు తెల్లవారుజామున దిల్లీ రోడ్లపై మహిళల భద్రత పరిస్థితులను పరిశీలించా. ఈ క్రమంలో ఓ కారు డ్రైవర్ మద్యం మత్తులో నాతో అనుచితంగా ప్రవర్తించాడు. అతన్ని పట్టుకునేందుకు యత్నించగా.. కారు అద్దం ఎక్కంచి, కొద్దిదూరం లాక్కెళ్లాడు. దేవుడే నన్ను కాపాడాడు. దేశ రాజధానిలో మహిళా కమిషన్ ఛైర్‌పర్సనే సురక్షితంగా లేరంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోండి’ అని ఆమె ట్వీట్‌ సైతం చేశారు.

ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడు హరీశ్‌చంద్ర(47)ను అరెస్టు చేశారు. కారును స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల దిల్లీలో ఓ యువతిని కారుతో ఢీకొట్టి, కొన్ని కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన ఘటనలో బాధిత యువతి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని