Gorakhnath: గోరఖ్‌నాథ్‌ ఆలయంలో దాడి.. ముర్తజా అబ్బాసీకి మరణశిక్ష

ప్రసిద్ధ గోరఖ్‌నాథ్‌ ఆలయంలోకి చొరబడి దాడికి పాల్పడిన ఘటనలో దోషికి మరణశిక్ష పడింది. ఈ మేరకు ఎన్‌ఐఏ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.

Published : 30 Jan 2023 19:03 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లోని ప్రసిద్ధ గోరఖ్‌నాథ్‌ ఆలయంలోకి చొరబడి కత్తితో బీభత్సం సృష్టించిన ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ముర్తాజా అబ్బాసీని దోషిగా తేల్చిన ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు.. అతడికి మరణశిక్ష విధించింది.

దాదాపు తొమ్మిది నెలల క్రితం గతేడాది ఏప్రిల్‌లో గోరఖ్‌పుర్‌లోని గోరఖ్‌నాథ్ (Gorakhnath) ఆలయంలో భద్రతా ఉల్లంఘన ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గోరఖ్‌పుర్‌ (Gorakhpur)కు చెందిన ముర్తజా అబ్బాసీ.. కత్తీతో వీరంగం సృష్టించాడు. ఆలయంలోకి బలవంతంగా ప్రవేశించేందుకు యత్నించిన అతడు.. అడ్డొచ్చిన యూపీ పీఏసీ జవాన్లపై దాడి చేశాడు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయం భక్తులతో నిండిపోయిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. అనంతరం పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా.. అబ్బాసీని పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు.

ఉగ్ర కుట్రలో భాగంగానే నిందితుడు ఈ దాడికి పాల్పడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అనంతరం ఈ ఘటనపై ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీసీ) దర్యాప్తు చేపట్టింది. విచారణలో అబ్బాసీ నుంచి కీలక విషయాలు బయటికొచ్చాయి. తనకు ఐసిస్‌ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లు అతడు దర్యాప్తులో అంగీకరించాడు. సుదీర్ఘ విచారణ అనంతరం.. ఈ కేసులో అబ్బాసీని ఎన్‌ఐఏ (NIA) కోర్టు దోషిగా తేల్చింది. అతడికి మరణశిక్ష విధిస్తూ నేడు తీర్పు వెలువరించింది.

అబ్బాసీ.. ఐఐటీ ముంబయి నుంచి 2015లో కెమికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. అనంతరం రెండు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగం కూడా చేశాడు. అయితే 2017 నుంచి అతడు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు అబ్బాసీ కుటుంబసభ్యులు ఆ మధ్య తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని