Haiti earthquake: హైతీలో భూకంప విలయం.. 2వేలకు చేరిన మృతులు

ప్రకృతి ప్రకోపానికి కరేబియన్‌ ద్వీప దేశం హైతీ అతలాకుతలమవుతోంది. గత వారాంతంలో సంభవించిన భారీ భూకంప విలయం నుంచి ఇంకా కోలుకోకముందే పెను

Updated : 18 Aug 2021 12:39 IST

దాదాపు 10,000 మందికి గాయాలు

లెస్‌ కేయెస్‌: ప్రకృతి ప్రకోపానికి కరేబియన్‌ ద్వీప దేశం హైతీ అతలాకుతలమవుతోంది. గత వారాంతంలో సంభవించిన భారీ భూకంప విలయం నుంచి కోలుకోకముందే పెను తుపాను విరుచుకుపడింది. దీంతో సహాయకచర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఇదిలా ఉండగా.. ఈ ఘోర భూకంప విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మంగళవారం నాటికి దాదాపు 2వేలకు చేరుకుంది. మరో 10వేల మంది గాయాలపాలయ్యారు. 

గత శనివారం 7.2 తీవ్రతతో భారీ భూకంపం హైతీ దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ విపత్తులో 1,941 మంది మరణించినట్లు ఆ దేశ సివిల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ నిన్న రాత్రి వెల్లడించింది. ఇక 9,900 మంది గాయపడ్డారని, వీరిలో చాలా మందికి ఇంకా వైద్య సాయం అందకపోవడంతో ఆసుపత్రుల వద్ద పడిగాపులు కాస్తున్నారని పేర్కొంది. 

ఈ పెను విధ్వంసానికి ఇళ్లు, భవనాలు పూర్తి నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారు. వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. అయితే, దెబ్బ మీద దెబ్బలా.. ఇప్పుడు హైతీపై గ్రేస్‌ తుపాను కూడా విరుచుకుపడింది. నిన్న చాలా ప్రాంతాలో భారీవర్షం కురిసింది. దీంతో సహాయకచర్యలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. 

2010లో కూడా హైతీలో భారీ భూకంపం సంభవించింది. ఆ విలయంలో దాదాపున మూడు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత పెను ప్రకృతి విలయాన్ని మళ్లీ ఇప్పుడే చూస్తున్నామని హైతీ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. భూకంపం కారణంగా ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు రోడ్డున పడి ఆకలితో అలమటిస్తున్నారు.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని