Accident: ఆగి ఉన్న బస్సులను వేగంగా ఢీకొట్టిన ట్రక్కు.. 14 మంది దుర్మరణం

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో ట్రక్కు బీభత్సం సృష్టించింది. టైరు పేలడంతో బస్సులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 14 మంది మృతిచెందారు.

Updated : 25 Feb 2023 13:21 IST

భోపాల్: మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన బస్సులను ఓ ట్రక్కు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది దుర్మరణం చెందగా.. మరో 60 మంది గాయపడ్డారు. శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

రేవా-సత్నా సరిహద్దుల్లోని బర్ఖదా గ్రామం సమీపంలో సిమెంటు లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కు (Truck) టైరు పేలిపోయింది. దీంతో వాహనం నియంత్రణ కోల్పోయి.. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన మూడు బస్సులను వేగంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఒక బస్సు ఒకవైపు పడిపోగా.. మరో బస్సు పక్కనే ఉన్న లోయలో బోల్తా కొట్టింది. దీంతో ఈ బస్సుల్లో ఉన్న ప్రయాణికుల్లో 14 మంది ప్రాణాలు కోల్పోగా.. 60 మంది గాయపడ్డారు. బస్సుల్లో ఉన్న ప్రయాణికులు సత్నాలో జరిగిన ‘కోల్‌ మహాకుంభ్‌’ ఉత్సవాల్లో పాల్గొని తిరిగి వస్తున్నారు. మార్గమధ్యంలో ప్రయాణికులకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేసేందుకు బస్సులను రోడ్డు పక్కన ఆపి ఉంచగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

ప్రమాదంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ (Shivraj Singh Chouhan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలియగానే ఆయన రేవా మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. ఇది చాలా దురదృష్టకర ఘటన అని.. అవసరమైతే క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం ఎయిర్‌ అంబులెన్స్‌ల్లో తరలిస్తామని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు రూ.2లక్షల ఆర్థికసాయం చేస్తామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని