
Train Accident: బెంగాల్ రైలు ప్రమాదం ఘటన.. 9కి చేరిన మృతుల సంఖ్య
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకున్న రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. జల్‌పాయ్‌గుడి జిల్లా దోహొమోనీ వద్ద గురువారం సాయంత్రం గువాహటి-బికనేర్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పి 12 బోగీలు బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు తొమ్మిది మంది మృతిచెందగా.. మరో 70 మందికి పైగా గాయపడినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు.
రాజస్థాన్‌లోని బికనేర్ నుంచి బయల్దేరిన ఈ రైలు పట్నా మీదుగా అస్సాంలోని గువాహటి వెళ్తుండగా బెంగాల్‌లోని జల్‌పాయ్‌గుడి జిల్లాలో ఈ దుర్ఘటన చోటుచేసుకొంది. ప్రమాదం ధాటికి రైలు బోగీలు ఒకదానిమీదకు ఒకటి ఎక్కాయి. సమాచారమందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఘటన సమయంలో రైలులో దాదాపు 1000 మంది ప్రయాణికులున్నారు. బోల్తా పడిన బోగీల్లోని ప్రయాణికులు అందులోనే చిక్కుకుపోయారు. గ్యాస్ కట్టర్ల సాయంతో బోగీలను కట్ చేసి ప్రయాణికులను రక్షించేందుకు యత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు తొమ్మిది మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని సిలిగురిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు అధికారులు వెల్లడించారు. ఘటనపై రైల్వే సేఫ్టీ కమిషనర్ నేతృత్వంలో ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.
ఈ రైలు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు. దుర్ఘటనపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఆరా తీశారు. అటు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, తీవ్ర గాయాలపాలైన వారికి రూ. లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25వేల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు.