Babia: ఆలయ తటాకంలో.. ‘శాకాహారి’ మొసలి మృతి

అనంతపద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన అనంతపుర కొలనులో ఉన్న బాబియా అనే శాకాహార మొసలి కన్నుమూసింది.

Updated : 10 Oct 2022 15:56 IST

కాసర్‌గోడ్‌ (కేరళ):  దేశంలోనే తటాకంలో ఉన్న ఆలయాల్లో ఒకటైన కాసర్‌గోడ్‌ జిల్లాలోని అనంతపద్మనాభ స్వామిఆలయానికి చెందిన అనంతపుర కొలనులో ఉన్న ఓ మొసలి  కన్నుమూసింది.

అనంతపద్మనాభ స్వామి క్షేత్రానికి చెందిన మహావిష్ణు ఆలయం అనంతపురలో ఉంది. అక్కడే ఉన్న ఈ మొసలిని స్థానికులు ప్రేమతో ‘బాబియా’ (Babia) అని పిలుస్తుంటారు. గడిచిన ఏడు దశాబ్దాలుగా ఈ ఆలయ పరిసరాల్లో స్వేచ్ఛగా విహరించే ఈ మొసలి ‘శాకాహారి’ అని చెబుతుంటారు. ఆలయంలో తయారు చేసే ప్రసాదాన్ని తిని జీవిస్తుందని ఆలయ అధికారులు పలు సందర్భాల్లో తెలిపారు. అంతేకాకుండా ఒకే ఒక్క మొసలి ఇలా ఒంటరిగా ఉండటాన్ని కూడా అరుదైన విషయంగా పేర్కొంటుంటారు. ఆలయ పరిసరాల్లో తిరిగినప్పటికీ ఎవరికీ హాని తలపెట్టదని నమ్మకం.

అలా నిత్యం అక్కడ సంచరించే ఈ మొసలి శనివారం నుంచి కనిపించకుండా పోయింది. అనంతరం ఆదివారం రాత్రి 11.30గంటల సమయంలో కొలనులో విగత జీవిగా తేలుతూ కనిపించింది. చనిపోయిందని భావించిన ఆలయ అధికారులు.. ఈ విషయాన్ని పోలీసులతోపాటు పశుసంవర్ధకశాఖ అధికారులకు తెలియజేశారు. అనంతరం కొలను నుంచి బయటకు తీశారు. దానిని చూసేందుకు సాధారణ పౌరులతో పాటు రాజకీయ నాయకులు, ప్రముఖులు ఆలయానికి చేరుకున్నారు.

‘శ్రీ అనంతపుర ఆలయ కొలనులో నివసిస్తోన్న ఈ మొసలి మోక్షం పొందింది. దేవుని స్వరూపంగా భావించే ఈ మకరం.. అనంతపద్మనాభ స్వామికి సమర్పించే అన్నం, బెల్లంతో తయారు చేసే ప్రసాదాన్ని తింటూ ఏడు దశాబ్దాలుగా ఆలయ ప్రాంగణంలో నివసిస్తోంది. ఓం శాంతి’ అంటూ కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని