Covaxin: ‘కొవాగ్జిన్‌’కు గుర్తింపుపై అక్టోబరులో తుది నిర్ణయం

కొవాగ్జిన్‌ టీకాను అత్యవసర వినియోగ వ్యాక్సిన్ల జాబితా(ఈయూఎల్‌)లో చేర్చాలన్న అంశంపై అక్టోబర్‌లో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ప్రస్తుతం ఈ టీకా సమాచారంపై మూల్యంకన ప్రక్రియ కొనసాగుతోందని తాజాగా...

Published : 30 Sep 2021 23:32 IST

వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

జెనీవా: కొవాగ్జిన్‌ టీకాను అత్యవసర వినియోగ వ్యాక్సిన్ల జాబితా(ఈయూఎల్‌)లో చేర్చాలన్న అంశంపై అక్టోబర్‌లో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ప్రస్తుతం ఈ టీకా సమాచారంపై తదుపరి ప్రక్రియ కొనసాగుతోందని తాజాగా తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. కొవాగ్జిన్‌ టీకాపై భారత్‌ బయోటెక్‌ సంస్థ ఏప్రిల్‌లో ఈఓఐ(ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌) సమర్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జూలై 6న వ్యాక్సిన్ డేటా రోలింగ్‌ ప్రక్రియను ప్రారంభించినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఇందులో భాగంగా సమాచార విశ్లేషణ మొదలవుతుంది. ఈయూఎల్‌లో చేర్చేందుకు కొవాగ్జిన్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని డబ్ల్యూహెచ్‌వోకు ఇప్పటికే సమర్పించామని, సంస్థ ఫీడ్‌బ్యాక్‌ కోసం ఎదురుచూస్తున్నట్లు భారత్ బయోటెక్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. మంగళవారం సైతం ఈ విషయమై ట్వీట్‌ చేసింది. ‘కొవాగ్జిన్‌’ టీకాకు డబ్ల్యూహెచ్‌ఓ నుంచి అత్యవసర గుర్తింపు పొందేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తున్నట్లు పేర్కొంది. ‘డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు ఎప్పుడు వస్తుందనే విషయంలో ఊహాగానాలు, అంచనాలు సరికాదు. ఈ విషయంలో మా వైపు నుంచి చేయగలిగినదంతా చేస్తున్నాం’ అని తెలిపింది. ‘కొవాగ్జిన్‌’ టీకాకు సంబంధించి అదనపు సమాచారాన్ని డబ్ల్యూహెచ్‌ఓ కోరినట్లు, అందువల్ల దీనికి అత్యవసర గుర్తింపు ఆలస్యం కావచ్చనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కంపెనీ స్పందించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని