Mansukh Mandaviya: ‘నిపుణుల సిఫార్సులు రాగానే వారికీ టీకాలు’

నిపుణుల బృందం సిఫార్సులు అందిన వెంటనే 5 నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకు కొవిడ్‌ టీకాలు అందజేస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. అయితే, ఈ విషయమై ఇంతవరకు ఎలాంటి సిఫార్సులు రాలేదని చెప్పారు. ‘ఈ వయస్సుల వారికి...

Published : 13 Feb 2022 01:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నిపుణుల బృందం సిఫార్సులు అందిన వెంటనే 5 నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకు కొవిడ్‌ టీకాలు అందజేస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. అయితే, ఈ విషయమై ఇంతవరకు ఎలాంటి సిఫార్సులు రాలేదని చెప్పారు. ‘ఈ వయస్సుల వారికి టీకాల ప్రక్రియ ప్రారంభించకపోవడమనేది రాజకీయ నిర్ణయం కాదు. ప్రస్తుత తరుణంలో వ్యాక్సిన్లు వేయడం సమస్య కాదు. మా వద్ద సరిపడ టీకా నిల్వలు ఉన్నాయి. కానీ, శాస్త్రీయ సూచనలు పాటిస్తాం. వాటి ఆధారంగానే రానున్న రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌పై నిర్వహించిన ఓ సమావేశంలో మంత్రి పాల్గొని ఈ మేరకు మాట్లాడారు. పైగా.. గతేడాది జులై- ఆగస్టులో నిర్వహించిన సెరో సర్వేలో 67 శాతం మంది పిల్లల్లోనూ యాంటీబాడీలు వృద్ధి అయినట్లు తేలిందని మంత్రి తెలిపారు. వారిలో వైరస్‌ లక్షణాలూ కనిపించడం లేదన్నారు.

‘ఇదివరకు టీకాలకు సంబంధించిన సిఫార్సుల విషయంలో ఇతర దేశాలను అనుసరించేవాళ్లం. ప్రస్తుతం భారతీయ శాస్త్రవేత్తలే విశ్లేషణలు, అధ్యయనాలు చేపడుతూ.. వాటి ఆధారంగా సిఫార్సులు చేస్తున్నారు. ప్రికాషన్‌ డోసుపై నిపుణుల బృందం సూచనలు అందిన వారంలోపే వాటిని అమలు చేశాం. 5 -15 ఏళ్లలోపు చిన్నారుల విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరిస్తాం’ అని మంత్రి వివరించారు. ముమ్మర వ్యాక్సినేషన్‌తోనే మూడో వేవ్‌పై భారత్‌ సమర్థంగా పోరాడినట్లు చెప్పారు. ‘2020లో లాక్‌డౌన్ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం టీకా తయారీపై దృష్టి సారించింది. ఆపత్కాలంలోనూ భారత్‌ తన వృద్ధి రేటును కొనసాగించడంలో ఇది సహాయపడింది. ఫలితంగా అమెరికా, యూరప్‌లో కనిపించినట్లు ఇక్కడ అధిక ద్రవ్యోల్బణం, ప్రతికూల వృద్ధి పరిస్థితులు ఎదురుకాలేదు’ అని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌పై మాట్లాడుతూ.. ఇది దేశ స్వర్ణయుగానికి నాంది పలుకుతుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు