ఎర్రకోట ఘటన: దీప్‌సిద్ధూ అరెస్టు

గణతంత్ర దినోత్సవం నాడు చారిత్రక ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న అల్లర్ల ఘటనలో అభియోగాలు ఎదుర్కొంటూ గత కొన్నిరోజులుగా కన్పించకుండాపోయిన పంజాబీ నటుడు దీప్‌సిద్ధూ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు

Updated : 09 Feb 2021 14:53 IST

దిల్లీ: గణతంత్ర దినోత్సవం నాడు చారిత్రక ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న అల్లర్ల ఘటనలో అభియోగాలు ఎదుర్కొంటూ గత కొన్నిరోజులుగా కన్పించకుండాపోయిన పంజాబీ నటుడు దీప్‌సిద్ధూ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. చండీగఢ్, అంబాలా మధ్యలోని జిరాక్‌పుర్‌ ప్రాంతంలో దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం దీప్‌ సిద్ధూను అరెస్టు చేసినట్లు డిప్యూటీ కమిషనర్‌ సంజీవ్‌ కుమార్‌ యాదవ్‌ మంగళవారం తెలిపారు. 

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తోన్న రైతులు తమ ఆందోళనలో భాగంగా గణతంత్ర దినోత్సవం నాడు దేశ రాజధానిలో చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అయితే జనవరి 26న జరిగిన ఉద్రిక్త పరిస్థితులకు దీప్ సిద్ధూనే కారణమని, రైతులు ఎర్రకోటవైపు వెళ్లేలా ఆయనే రెచ్చగొట్టారంటూ ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా, ఎర్రకోటపై మతపరమైన జెండాతో పాటు రైతుల జెండా ఎగురవేసిన సమయంలో సిద్ధూ అక్కడే ఉన్నారు. జెండాలు ఎగురవేయడాన్ని సమర్థిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టులు కూడా చేశారు. అల్లర్లకు సిద్ధూనే బాధ్యుడంటూ రైతు సంఘాలు కూడా ఆరోపించాయి. అయితే ఆ తర్వాత నుంచి సిద్ధూ కన్పించకుండా పోయారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆయన ఆచూకీ చెప్పినవారికి రూ.లక్ష రివార్డు కూడా ప్రకటించారు. 

కాగా.. అజ్ఞాతంలో ఉన్నప్పటికీ ఫేస్‌బుక్‌లో సిద్ధూ వీడియోలు పోస్ట్‌ చేస్తూనే ఉన్నారు. అయితే ఆ వీడియోలను విదేశాల్లో ఉంటున్న సిద్ధూ స్నేహితురాలు ఒకరు పోస్ట్‌ చేసినట్లు తెలిసింది. ‘కాలిఫోర్నియాలో ఉంటున్న ఓ స్నేహితురాలితో సిద్ధూ కాంటాక్ట్‌లో ఉన్నారు. సిద్ధూ వీడియోలు చేసి పంపితే.. ఆమె వాటిని సోషల్‌మీడియాలో అప్‌లోడ్‌ చేశారు’ అని దిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ఇవీ చదవండి..

చర్చలకు సిద్ధం.. తేదీ చెప్పండి

సంస్కరణలు తప్పవు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని