Defence Ministry: రక్షణ రంగానికి బూస్ట్‌.. రూ.76 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం!

రక్షణారంగంలో ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’కు పెద్దపీట వేస్తూ కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన సోమవారం సమావేశమైన డిఫెన్స్ అక్విజిషన్స్ కౌన్సిల్(డీఏసీ).. రూ.76,390 కోట్ల విలువైన సైనిక...

Updated : 07 Jun 2022 03:02 IST

దిల్లీ: రక్షణారంగంలో ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’కు పెద్దపీట వేస్తూ కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన సోమవారం సమావేశమైన డిఫెన్స్ అక్విజిషన్స్ కౌన్సిల్(డీఏసీ).. రూ.76,390 కోట్ల విలువైన సైనిక ఆధునికీకరణ ప్రాజెక్టులకు ప్రాథమిక ఆమోదం తెలిపింది. సైనిక పరికరాల కోసం విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గించడానికి, తద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు. భారతీయ రక్షణ పరిశ్రమకు ప్రోత్సాహాన్నీ అందిస్తుందని చెప్పారు.

ఆమోదించిన ప్రాజెక్టులివే..

* స్వదేశీ సంస్థల నుంచి సైన్యం.. యుద్ధ వాహనాలు, వస్తువులను ఎత్తే ట్రక్కులు, బ్రిడ్జ్‌ లేయింగ్‌ ట్యాంకులు, యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిసైల్స్‌, ఆయుధాలను గుర్తించే రాడార్‌లను సమకూర్చుకోనుంది. ఈ కంపెనీలు.. స్వదేశీ రూపకల్పన, తయారీపై దృష్టి సారించాల్సి ఉంటుంది.

* నౌకాదళాన్ని మరింత పటిష్ఠం చేసే దిశగా దాదాపు రూ.36 వేల కోట్ల వ్యయంతో తరువాతి తరం కొర్వెట్‌(చిన్నపాటి యుద్ధనౌక)ల కొనుగోలుకు ఆమోదం. ఇవి అత్యాధునిక నిర్మాణ సాంకేతికతతోపాటు భారత నౌకాదళ డిజైన్లపై ఆధారపడి ఉంటాయి.

* హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌తోపాటు సుఖోయ్‌-30 ఎంకేఐ ఏరో-ఇంజిన్‌ల తయారీకి ఊతం. ముఖ్యంగా ఏరో-ఇంజిన్ మెటీరియల్‌లో స్వదేశీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి.

* రక్షణారంగంలో డిజిటలీకరణ లక్ష్యానికి అనుగుణంగా 'డిజిటల్ కోస్ట్ గార్డ్' ప్రాజెక్ట్‌కు అనుమతి. ఇందులో భాగంగా కోస్ట్ గార్డ్‌ కార్యకలాపాలు, లాజిస్టిక్స్, ఫైనాన్స్, హెచ్‌ఆర్ విభాగాల డిజిటలైజేషన్‌ కోసం ఓ సురక్షిత నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని