India- China: తవాంగ్‌లో ఘర్షణ.. రాజ్‌నాథ్‌ ఉన్నతస్థాయి సమావేశానికి పిలుపు!

అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లో భారత్‌ - చైనా బలగాల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. దీనిపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేడు రక్షణ, విదేశాంగ శాఖ ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు.

Updated : 13 Dec 2022 13:17 IST

దిల్లీ: భారత్‌, చైనా(China) సరిహద్దుల్లో అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌(Tawang Sector)లో ఇరు దేశాల సైనికుల మధ్య తాజాగా ఘర్షణ చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. చైనాతో వాస్తవాధీన రేఖ(LAC) వెంబడి భద్రతా పరిస్థితులపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS‌) లెఫ్టినెంట్‌ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌(Rajnath Singh) నేడు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. దీంతోపాటు ఈ వివాదంపై మంత్రి రాజ్‌నాథ్‌ నేడు పార్లమెంటు ఉభయ సభల్లోనూ మాట్లాడనున్నట్లు ప్రభుత్వ వర్గాలు  వెల్లడించాయి.

విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌, ఆర్మీ జనరల్‌ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే, నౌకాదళాధిపతి అడ్మిరల్‌ హరికుమార్‌, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధరి తదితరులు రాజ్‌నాథ్‌తో సమావేశానికి హాజరుకానున్నారు. మరోవైపు.. తవాంగ్‌లో ఇరుపక్షాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై స్థానిక భద్రతా బలగాలు ఇప్పటికే మంత్రికి అప్‌డేట్‌ ఇచ్చినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా.. తవాంగ్‌ సెక్టార్‌లోని యాంగ్‌త్సె ప్రాంతం వద్ద ఈ నెల 9న ఘర్షణ చోటుచేసుకున్నట్లు వివరాలు బయటకువచ్చాయి. ఇందులో రెండువైపులా సైనికులు గాయపడినట్లు భారత సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలోనే రక్షణ, విదేశాంగశాఖలు ఉన్నతస్థాయి సమావేశానికి సిద్ధమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని