Indigenous Weapons: సరిహద్దుల్లో చైనా కవ్వింపులకు చెక్‌..

దేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా సైన్యం అమ్ములపొదిలో మరిన్ని ఆయుధాలు చేరాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆయుధాలు, సాంకేతిక వ్యవస్థలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేడు

Updated : 16 Aug 2022 18:52 IST

ఆర్మీ చేతికి సరికొత్త స్వదేశీ ఆయుధాలు, పరికరాలు

దిల్లీ: దేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా సైన్యం అమ్ములపొదిలో మరిన్ని ఆయుధాలు చేరాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆయుధాలు, సాంకేతిక వ్యవస్థలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేడు ఆర్మీకి అందజేశారు. ఫ్యూచర్‌ ఇన్‌ఫాంట్రీ సోల్జర్‌ యాజ్‌ ఏ సిస్టమ్‌(F-INSAS), కొత్త తరం యాంటీ పర్సనల్‌ మైన్‌ ‘నిపున్‌’, ఆటోమేటిక్‌ కమ్యూనికేషన్ సిస్టమ్‌, ట్యాంకులకు ఆధునీకరించిన సైట్‌ సిస్టమ్‌, అడ్వాన్స్‌డ్‌ థర్మల్‌ ఇమేజర్స్‌తో పాటు ఇన్‌ఫాంట్రీ ప్రొటెక్టెడ్‌ వెహికల్స్‌, ల్యాండింగ్‌ క్రాఫ్ట్‌ అసల్ట్ బోట్స్‌ను రాజ్‌నాథ్‌ అందజేశారు.

ఈ పరికరాలు/వ్యవస్థలను ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమం కింద డీఆర్‌డీవో, డిఫెన్స్‌ పబ్లిక్‌ సెక్టార్ అండర్‌టేకింగ్స్‌ సహకారంతో ఆర్మీ అభివృద్ధి చేసింది. ఈ కొత్త ఆయుధాలతో భారత సైన్యం శక్తి, సామర్థ్యాలు మరింత పెరుగుతాయని, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సైన్యం సంసిద్ధంగా ఉండేలా దోహదపడతాయని రాజ్‌నాథ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇందులో కొన్ని పరికరాలను రాజ్‌నాథ్‌ నేరుగా ఆర్మీ అధికారులకు అందజేయగా.. బోట్లు, డ్రోన్‌ వ్యవస్థలను వర్చువల్‌గా ఆర్మీకి అప్పగించారు.

ఇందులో ల్యాండింగ్‌ క్రాఫ్ట్‌ అసల్ట్‌ బోట్స్‌ లద్ధాఖ్‌ సరిహద్దుల్లోని పాంగాంగ్‌ సరస్సులో విధులు నిర్వహించనున్నాయి. ఈ పడవలు 35 మంది యుద్ధ బృందాలను ఒకేసారి తీసుకెళ్లగలవు. అంతేగాక, సరస్సులో ఏ ప్రాంతానికైనా చాలా తక్కువ సమయంలో చేరుకోగలవు. ఈ పడవలను గోవాకు చెందిన ఆక్వారియస్‌ షిప్‌ యార్డ్‌ లిమిటెడ్‌ తయారుచేసింది. దీంతో పాటు వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ఫార్వర్డ్‌ ప్రాంతాల్లో శత్రువుల కదలికలపై దృష్టిపెట్టేందుకు వీలుగా తయారుచేసిన డ్రోన్ వ్యవస్థను కూడా నేడు ఆర్మీకి అందించారు.

తూర్పు లద్దాఖ్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దుల్లో భారత్, చైనా మధ్య నెలకొన్న ప్రతిష్టంభన రెండేళ్లుగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వాస్తవాధీన రేఖ వెంబడి చైనా పలుమార్లు కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. యుద్ధ విమానాలను భారత సరిహద్దులకు పంపుతూ రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది. చైనా కవ్వింపులకు భారత్‌ కూడా దీటుగా బదులిస్తోంది. తాజాగా ఈ కొత్త ఆయుధాలతో డ్రాగన్‌ ఆటలకు కళ్లెం వేసేందుకు భారత సైన్యానికి అదనపు బలం చేకూరినట్లయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని