AIIMS: సర్వర్‌పై సైబర్‌ దాడికి యత్నించారని ఎయిమ్స్ ట్వీట్.. అదేం లేదంటూ కేంద్రమంత్రి క్లారిటీ!

దిల్లీలోని ఎయిమ్స్‌ (AIIMS) సర్వర్లపై హ్యాకర్లు మరోసారి సైబర్‌ దాడికి యత్నించారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే, ఎలాంటి సైబర్‌ దాడి జరగలేదని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌ (Rajeev Chandrasekha) ప్రకటించారు.

Published : 06 Jun 2023 23:23 IST

దిల్లీ: దిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రి (AIIMS Delhi) సర్వర్లపై హ్యాకర్లు (Hackers) మరోసారి సైబర్‌ దాడి (Cyber Attack)కి విఫలయత్నం చేసినట్లు వచ్చిన వార్తలు కలకలం రేపాయి. అయితే, వారి ప్రయత్నాలు సఫలం కాలేదని ఎయిమ్స్ ఆస్పత్రి వర్గాలు ట్విటర్‌లో వెల్లడించాయి. దీనిపై కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ (Rajeev Chandrasekha) భిన్న ప్రకటన చేశారు. ఎయిమ్స్ సర్వర్లపై ఎవరూ సైబర్‌దాడికి యత్నించలేదని స్పష్టంచేశారు. ఈ-హాస్పటల్‌ (E-Hospital) సేవల్లోని సమాచారం లక్ష్యంగా ఈ సైబర్‌ దాడి జరిగినట్లు తొలుత ఎయిమ్స్‌ తన అధికారిక ట్విటర్‌లో ట్వీట్ చేసింది. అయితే, సైబర్‌ దాడే జరగలేదని.. కేంద్ర మంత్రి మరో ట్వీట్ చేయడం గమనార్హం.

‘‘ఈరోజు మధ్యాహ్నం 2:50గంటల సమయంలో దిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి చెందిన ఈ-హాస్పటల్‌ డేటా లక్ష్యంగా సర్వర్లలోకి ఓ మాల్‌వేర్‌ను ప్రవేశపెట్టేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తున్నట్లు సైబర్‌ సెక్యూరిటీ సిస్టమ్స్ గుర్తించాయి.  అయితే, వారి ప్రయత్నాలను సైబర్‌ సెక్యూరిటీ సిస్టమ్స్‌ సమర్థవంతంగా అడ్డుకున్నాయి. ప్రస్తుతం ఈ-హాస్పటల్‌ సేవల భద్రతలో ఎలాంటి లోపం లేదు. ఎప్పటిలాగే ఈ సేవలు పనిచేస్తున్నాయి’’ అని ఎయిమ్స్‌ ట్వీట్‌లో పేర్కొంది. 

‘‘ఈ-హాస్పటల్‌ సేవలు పూర్తిగా ఎయిమ్స్‌ సిబ్బంది మాత్రమే ఉపయోగించే అంతర్గత అప్లికేషన్‌. అది, సాధారణ ఇంటర్నెట్‌ యూజర్లకు అందుబాటులో ఉండదు. ఒకవేళ ఎవరైనా ఈ అప్లికేషన్‌ను అనుమతి లేకుండా ఉపయోగించాలని ప్రయత్నిస్తే.. ఎయిమ్స్‌లోని సైబర్‌ సెక్యూరిటీ వ్యవస్థ అక్కడి సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. అలా, ఎవరైనా బయటి వ్యక్తులు ఈ-హాస్పటల్‌ అప్లికేషన్‌ను ఉపయోగించేందుకు ప్రయత్నించినప్పుడు వైరస్‌ అంటూ వచ్చిన ఎర్రర్‌ మెసేజ్‌ను స్క్రీన్‌ షాట్‌ తీసి సైబర్‌ దాడి జరిగినట్లు ప్రచారం చేస్తున్నారు. నిజానికి, ఎలాంటి సైబర్‌ దాడి ఘటనలు చోటు చేసుకోలేదు. వైరస్‌ అంటూ వచ్చే ఎర్రర్‌ మెసేజ్‌ సమస్యను కూడా పరిష్కరించారు’’ అని మంత్రి తన ట్వీట్‌లో వివరించారు. 

గతేడాది నవంబరులో దిల్లీ ఎయిమ్స్‌లోని సర్వర్లపై సైబర్‌ దాడి జరిగింది. చైనా, హాంకాంగ్‌లలోని రెండు ప్రాంతాల నుంచి హాక్యర్లు ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించారు. మొత్తం 100 సర్వర్లలో ఐదు సర్వర్లపై దాడి చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. వీటిలోని లక్షల మంది రోగుల డేటాను విజయవంతంగా తిరిగి పొందినట్లు పేర్కొన్నాయి. దీనిపై ఎయిమ్స్‌ కూడా అప్పట్లో ఓ ప్రకటన విడుదల చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని