Delhi: ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోం.. స్కూళ్ల మూసివేత : దిల్లీ సర్కార్‌ కీలక నిర్ణయాలు..

దిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ అతి తీవ్రత స్థాయిని సూచిస్తోంది. దీంతో కాలుష్య నివారణకు దిల్లీ ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక ప్రకటించింది.

Updated : 04 Nov 2022 17:32 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోయిన నేపథ్యంలో కాలుష్య నివారణకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఉద్యోగుల్లో సగం మందికి ‘ఇంటి నుంచి పని’ విధానాన్ని ప్రకటించింది. ప్రైవేటు కార్యాలయాలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తే మంచిదని సూచించింది. అటు రేపటి నుంచి ప్రాథమిక పాఠశాలలను కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు దిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్‌.. కాలుష్య నియంత్రణకు కార్యాచరణ ప్రణాళికను వెల్లడించారు.

దిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో పర్యావరణ మంత్రి గోపాల్‌ రాయ్‌ నేడు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ నాలుగో దశ కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. దీని ప్రకారం.. దిల్లీ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో 50శాతం సిబ్బందికి వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు గోపాల్‌ రాయ్‌ తెలిపారు. ప్రైవేటు ఆఫీసులు కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని సూచించారు. ఇక, ఆఫీసులు, మార్కెట్ల పనివేళలను కుదించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. దీనిపై రెవెన్యూ కమిషనర్లు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యాచరణ ప్రణాళిక అమలును పర్యవేక్షించేందుకు ఆరుగురు సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసినట్లు గోపాల్ రాయ్‌ తెలిపారు. కాలుష్యం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

అంతకుముందు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా కాలుష్య పరిస్థితులపై మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉన్నందున శనివారం నుంచి దిల్లీలో ప్రైమరీ స్కూళ్లను మూసివేస్తున్నట్లు తెలిపారు. ఐదు, ఆపై తరగతుల విద్యార్థులకు అవుట్‌డోర్‌ గేమ్స్‌ను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్‌ నియంత్రణకు మళ్లీ ‘సరి-బేసి’ విధానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు.

సరిహద్దు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం కారణంగా దిల్లీలో నానాటికీ కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. ఈ క్రమంలోనే ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు రావడంతో కేజ్రీవాల్‌ స్పందించారు. పంజాబ్‌లో పంట వ్యర్థాల దహనానికి పూర్తి బాధ్యత తమదేనని, వచ్చే ఏడాది నాటికి ఈ సమస్యకు పూర్తి పరిష్కారం కనుగొంటామని తెలిపారు. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దంటూ హితవు పలికారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని