Atishi: దయచేసి దిల్లీకి నీరు విడుదల చేయండి: ఆప్‌ నేత ఆతిశీ

దేశ రాజధాని తీవ్ర నీటి సంక్షోభం ఎదుర్కొంటుందని, హరియాణా ప్రభుత్వం మానవతా దృక్పథంతో నీరు విడుదల చేయాలని దిల్లీ మంత్రి ఆతిశీ కోరారు.

Updated : 15 Jun 2024 17:17 IST

దిల్లీ: హీట్‌వేవ్ కారణంగా దిల్లీ ప్రజలు నీటి సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆప్‌(APP) నేత, దిల్లీ మంత్రి ఆతిశీ(Atishi) ఆవేదన వ్యక్తంచేశారు. హరియాణా(Haryana) రాష్ర్టం మానవతా దృక్పథంతో నీరు విడుదల చేయాలని ఆమె కోరారు. ఇటీవల దేశ రాజధానికి 137 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేయాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు(Supreme Court)  ఆదేశించింది.

దిల్లీ నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో నీటి విషయంలో రాజకీయాలు చేయకూడదని, దేశ రాజధానికి మిగులు జలాలను సరఫరా చేయాలని సుప్రీంకోర్టు హరియాణాకు తెలిపింది. హిమాచల్ ప్రదేశ్‌ విడుదల చేసిన నీరు దిల్లీకి అందేలా చూడాలని సూచించింది. దిల్లీలో తాగునీటి కొరత ‘‘అస్తిత్వ సమస్య’’గా మారిందని కోర్టు పేర్కొంది. హిమాచల్ నీటిని విడుదల చేసిందని, అయితే ఆ నీరు హరియాణా మీదుగా ప్రవహిస్తున్నందున దిల్లీకి కావాల్సిన నీటి వాటాను భాజపా పాలిత రాష్ర్టం హరియాణా విడుదల చేయడం లేదని ఆప్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

హరియాణా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి అదనంగా నీరు అందించాలని కోరుతూ దిల్లీ ప్రభుత్వం గత వారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హీట్‌వేవ్‌ కారణంగా కొద్దికాలంగా రాష్ట్రంలో నీటి డిమాండ్ గణనీయంగా పెరిగిందని తన పిటిషన్‌లో పేర్కొంది. హరియాణా, యూపీ, హిమాచల్‌తో సహా ఇతర రాష్ట్రాల నుంచి ఒక నెల పాటు అదనంగా నీరు విడుదల చేయాలని న్యాయస్థానాన్ని కోరింది. రాష్ట్రం నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న వేళ దిల్లీలో నిర్మాణ ప్రదేశాల్లో నీటి వినియోగం, వాహనాలను కడగడం వంటి వాటిపై ప్రభుత్వం నిషేధం విధించింది. నీటిని వృథా చేసినవారికి రూ.2,000 జరిమానా విధిస్తామని పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని