Delhi Assembly: 66శాతం పెరిగిన దిల్లీ ఎమ్మెల్యేల జీతం.. నెలకు ఎంతంటే..?

దిల్లీ శాసనసభ సభ్యులు (MLA) జీతాలు భారీగా పెరగనున్నాయి. ఇందుకు సంబంధించిన బిల్లులకు దిల్లీ అసెంబ్లీ (Assembly) ఆమోదం తెలిపింది.

Published : 04 Jul 2022 20:26 IST

ఐదు బిల్లులకు దిల్లీ అసెంబ్లీ ఆమోదం

దిల్లీ: దిల్లీ శాసనసభ సభ్యులు (MLA) జీతాలు భారీగా పెరగనున్నాయి. ఇందుకు సంబంధించిన బిల్లులకు దిల్లీ అసెంబ్లీ (Assembly) ఆమోదం తెలిపింది. దీంతో సభ్యుల జీతాలు, అలవెన్సుల్లో 66శాతం పెరగనుంది. ఇప్పటివరకు దేశంలోనే తక్కువ జీతాలు దిల్లీ అసెంబ్లీ సభ్యులకు ఉన్నాయని.. 11ఏళ్ల తర్వాత జీతాలు పెరుగుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. పెరుగుతున్న ధరల నేపథ్యంలో జీతాలు పెంచాలని సభ్యుల నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. శాసనసభ సభ్యుల జీతాల పెంపునకు అటు ప్రతిపక్ష భాజపా కూడా మద్దతు పలికింది.

మంత్రులు, ఎమ్మెల్యేలు, చీఫ్‌ విప్‌లు, స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుల జీతాలకు సంబంధించి ఐదు ప్రత్యేక బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందుకు అసెంబ్లీ ఆమోదం పొందడంతో తదుపరి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నట్లు దిల్లీ రెవెన్యూ మంత్రి కైలాస్‌ గహ్లోత్‌ పేర్కొన్నారు. ఇక ఇదే అంశంపై స్పందించిన ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా.. ప్రతిభ కలిగిన పౌరులను రాజకీయాల్లోకి ఆహ్వానించాలంటే వారికి కొన్ని రివార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అత్యధిక జీతాలు ఉండడం వల్లే కార్పొరేట్‌ సంస్థలు ప్రతిభ కలిగిన వ్యక్తులను పొందగలుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.

ఇదిలాఉంటే, ప్రస్తుతం దిల్లీ శాసనసభ సభ్యుల జీతం నెలకు రూ.54వేలుగా ఉంది. తాజా పెంపునకు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాత వారి జీతం రూ.90వేలకు చేరుకుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని