Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు సాధారణ బెయిల్‌

మద్యం విధాన కుంభకోణంలో నగదు అక్రమ చలామణి అభియోగాలను ఎదుర్కొంటున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు పెద్ద ఊరట లభించింది.

Published : 21 Jun 2024 06:03 IST

దిల్లీ: మద్యం విధాన కుంభకోణంలో నగదు అక్రమ చలామణి అభియోగాలను ఎదుర్కొంటున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు పెద్ద ఊరట లభించింది. దిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం గురువారం ఆయనకు సాధారణ బెయిల్‌ మంజూరు చేసింది. రూ.లక్ష వ్యక్తిగత బాండు సమర్పించిన తర్వాత ఆయన్ని విడుదల చేయవచ్చని న్యాయమూర్తి న్యాయ్‌ బిందు ఆదేశించారు. తీర్పుపై పైకోర్టులో అప్పీలు దాఖలు చేయడానికి వీలుగా దానిని 48 గంటలపాటు పక్కనపెట్టాలని  ఈడీ చేసిన వినతిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. విచారణకు ఆటంకం కలిగించరాదని, సాక్షుల్ని ప్రభావితం చేయకూడదని కేజ్రీవాల్‌పై ఆంక్షలు విధించారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు కోర్టుకు హాజరై విచారణకు సహకరించాలని ఆదేశించారు. ఉదయం వాదోపవాదాల తర్వాత తీర్పును వాయిదా వేసిన న్యాయమూర్తి.. సాయంత్రం దానిని వెలువరించారు. 

లావాదేవీల్లో ఆయన ప్రమేయం : ఈడీ 

కేసులో సహనిందితులు పొందిన డబ్బుతో కేజ్రీవాల్‌కు సంబంధం ఉందని ఈడీ వాదించింది. 2021 నవంబరు 7న కేజ్రీవాల్‌ గోవాలోని గ్రాండ్‌హయత్‌ హోటల్లో బస చేసినప్పుడు ఆయన తరఫున రూ.లక్ష బిల్లును చెల్లించిన చరణ్‌ప్రీత్‌ సింగ్‌ కూడా సహ నిందితుడేనని తెలిపింది. వేర్వేరు మార్గాల ద్వారా చరణ్‌ప్రీత్‌కు రూ.45 కోట్లు అందినట్లు ఆరోపించింది. కేజ్రీవాల్‌కు ఎన్నిసార్లు సమన్లు ఇచ్చినా ఉద్దేశపూర్వకంగా వాటిని పట్టించుకోలేదని, తొమ్మిదిసార్లు అలా జరిగినా తాము అరెస్టు చేయలేదని తెలిపింది. సౌత్‌ గ్రూప్‌ నుంచి రూ.100 కోట్లు అందాయని ఆరోపించినా దానికి ఆధారాలు లేవని,  కొందరి వాంగ్మూలాల ఆధారంగానే కేసు నడుస్తోందని సీఎం తరఫు న్యాయవాదులు వాదించారు.   

కేజ్రీవాల్‌కు న్యాయస్థానం బెయిల్‌ ఇవ్వడంపై ఆప్‌ హర్షం వ్యక్తంచేసింది. సత్యమేవ జయతే అని దిల్లీ మంత్రి ఆతిశీ, పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌ పేర్కొన్నారు. కోర్టు సూచించిన బెయిల్‌ బాండ్లను కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాదులు శుక్రవారం ఉదయం కోర్టులో సమర్పించాక ఆయన తిహాడ్‌ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

 

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని