Jaishankar :కేజ్రీవాల్‌ భారత్ కోసం మాట్లాడరు

సింగపూర్‌లో కరోనా కొత్త రకం అంటూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యను ఆ దేశం తీవ్రంగా ఖండించగా..తాజాగా భారత ప్రభుత్వం స్పందించింది.

Published : 19 May 2021 16:41 IST

దిల్లీ: సింగపూర్‌లో కరోనా కొత్త రకం అంటూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యను ఆ దేశం తీవ్రంగా ఖండించగా..తాజాగా భారత ప్రభుత్వం స్పందించింది. సింగపూర్ ప్రభుత్వం భారత రాయబారికి సమన్లు జారీ చేసి, తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందని తెలిపింది. కేజ్రీవాల్‌కు కొవిడ్ రకాలపై అవగాహన లేదని రాయబారి వివరణ ఇచ్చినట్లు చెప్పింది. 

‘‘సింగపూర్ వేరియంట్‌’ అంటూ దిల్లీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యను సింగపూర్‌ ప్రభుత్వం ఖండించింది. భారత రాయబారిని పిలిచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కొవిడ్ రకాలు, పౌర విమానయాన విధానంపై మాట్లాడేంత అవగాహన ఆయనకు లేదని రాయబారి స్పష్టత ఇచ్చారు’ అంటూ విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. అలాగే విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కూడా కేజ్రీవాల్‌ వైఖరిని తప్పుపట్టారు.‘ కొవిడ్‌-19పై జరిపే పోరాటంలో సింగపూర్, భారత్ దృఢమైన భాగస్వాములు. ఆక్సిజన్ సరఫరాదారుగా ఆ దేశ పాత్రను అభినందించండి. మనకు సహకరించేందుకు సైనిక విమానాలను మోహరించాలనే వారి వైఖరి.. రెండు దేశాల మధ్య ఉన్న బలమైన బంధాన్ని వెల్లడిచేస్తోంది. కొందరు చేసిన బాధ్యతారహితమైన వ్యాఖ్యలు ఇరు దేశాల దీర్ఘకాలిక సంబంధాలపై ప్రభావం చూపుతాయి. దిల్లీ ముఖ్యమంత్రి భారత దేశం కోసం మాట్లాడరని స్పష్టం చేయదల్చుకున్నాను’ అని ట్వీట్ చేశారు. 

సింగపూర్‌లో ప్రబలుతున్న కొత్త రకం కరోనా వైరస్ చిన్నారులకు ప్రమాదకరమని కేజ్రీవాల్ నిన్న ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. వెంటనే ఆ దేశం నుంచి విమాన సర్వీసులను నిలిపివేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, భారత్‌లో కన్పించిన కొవిడ్ లక్షణాలు తమ దేశంలోనూ కన్పించడంతో బుధవారం నుంచి దేశంలోని బడులన్నీ మూసివేయాలని సింగపూర్ నిర్ణయించింది. అక్కడ తాజాగా 38 కేసులు వెలుగుచూడగా..వారిలో ఎక్కువ మంది పిల్లలే ఉండటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని