దిల్లీలో పోలీసు కుటుంబాల నిరసన ప్రదర్శన!

దేశరాజధానిలో రైతుల ట్రాక్టర్‌ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై దిల్లీ పోలీసు కుటుంబాలు నిరసన వ్యక్తం చేశాయి.

Updated : 30 Jan 2021 18:25 IST

దిల్లీ: దేశరాజధానిలో రైతుల ట్రాక్టర్‌ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై దిల్లీ పోలీసు కుటుంబాలు నిరసన వ్యక్తం చేశాయి. దిల్లీ పోలీస్‌ మహాసంఘ్‌ ఆధ్వర్యంలో షహీదీ పార్క్‌ వద్ద శనివారం నిరసన చేపట్టాయి. ఈ ప్రదర్శనలో.. జనవరి 26 ఘటనలో గాయపడిన పోలీసుల కుటుంబాలు, ప్రస్తుత అధికారులు, విశ్రాంత పోలీసులు పాల్గొన్నారు. పోలీసులపై జరిగిన దాడుల్ని వారు ముక్త కంఠంతో ఖండిస్తూ.. ప్లకార్డులు ప్రదర్శించారు.  

ఈక్రమంలో ప్రదర్శనలో పాల్గొన్న హెడ్‌ కానిస్టేబుల్‌ అశోక్‌ మాట్లాడుతూ.. ‘నేను రిపబ్లిక్‌డే రోజున ఎర్రకోట వద్ద విధుల్లో ఉన్నాను. కర్రలు, కత్తులతో కొందరు వ్యక్తులు మాపై దాడి చేశారు. నాకు తల, కాళ్లపై గాయాలయ్యాయి’ అని తెలిపారు. మరో మహిళా కానిస్టేబుల్‌ సునీత మాట్లాడుతూ.. ‘నేను ముబారక్‌ చౌక్‌ వద్ద విధుల్లో ఉన్నాను. అక్కడ డీసీపీ, ఏసీపీ అధికారులు సైతం ఉన్నారు. రైతులు తమకు అనుమతి లేని మార్గంలోకి రావద్దని అధికారులు వారిని కోరారు. అయినప్పటికీ వారు దుందుడుకుగా వ్యవహరించి బారికేడ్లను విరగ్గొట్టి మరీ మీదికి దూసుకువచ్చి దాడి చేశారు. నాకు కూడా స్వల్ప గాయాలయ్యాయి’ అని తెలిపారు. 

ఎర్రకోటకు ఫోరెన్సిక్‌ నిపుణులు
చారిత్రక కట్టడం ఎర్రకోట సమీపంలో చెలరేగిన హింసాత్మక ఘటనపై సాక్ష్యాధారాల సేకరణకు ఫోరెన్సిక్‌ నిపుణుల బృందం శనివారం అక్కడికి వెళ్లింది. హింసాత్మక ఘటనకు సంబంధించి సాక్ష్యాధారాల కోసం నిపుణులు ఎర్రకోటలో పరిసరాలను పరిశీలించారు. ఈ మేరకు అక్కడి అధికారి మీడియాతో వెల్లడించారు. ‘ఎర్రకోట వద్ద గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన ధ్వంసం ఘటనపై సాక్ష్యాధారాలు సేకరించేందుకు ఫోరెన్సిక్‌ నిపుణుల బృందం ఇక్కడికి వచ్చారు’ అని తెలిపారు.  కాగా ఇప్పటికే ఈ ఘటనపై దిల్లీ నేర విభాగం పోలీసులు విచారణ జరుపుతుండగా.. దోషుల్ని గుర్తించేందుకు పలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కాగా ఇప్పటికే ఈ హింసాత్మక ఘటనకు సంబంధించి ఎలాంటి ఆధారాలు, సమాచారం ఉన్నా తెలియజేయాలని దిల్లీ పోలీసులు వార్తా పత్రికలను ఓ ప్రకటనలో కోరారు. 

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులు.. జనవరి 26న నిర్వహించిన ట్రాక్టర్‌ ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ తలెత్తడంతో.. కొందరు రైతులు చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద పాగా వేశారు. కోట పైభాగంలో  రైతు జెండాలను ఎగురవేశారు. ఈ ఘటనలో కొందరు పోలీసులకు గాయాలయ్యాయి. 

ఇదీ చదవండి

మా ప్రభుత్వం ఫోన్‌కాల్‌ దూరంలోనే ఉంది:మోదీ
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని