Narco test: ఆఫ్తాబ్‌కు నార్కో పరీక్షకు కోర్టు ఓకే‌.. అసలేమిటీ నార్కో ఎనాలసిస్‌?

సహజీవన భాగస్వామి శ్రద్ధా వాకర్‌ను అత్యంత కిరాతకంగా హతమార్చిన కేసులో నిందితుడైన ఆఫ్తాబ్‌ అమిన్‌ పూనావాలా(Aaftab Amin Poonawala )కు నార్కో పరీక్ష(Narco Test) జరిపేందుకు దిల్లీ పోలీసులకు కోర్టు అనుమతి ఇచ్చింది.

Updated : 29 Nov 2022 17:33 IST

దిల్లీ: సహజీవన భాగస్వామి శ్రద్ధా వాకర్‌ను అత్యంత కిరాతకంగా హతమార్చిన కేసులో నిందితుడైన ఆఫ్తాబ్‌ అమిన్‌ పూనావాలా(Aaftab Amin Poonawala )కు నార్కో పరీక్ష(Narco Test) జరిపేందుకు దిల్లీ పోలీసులకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని ఆఫ్తాబ్‌ తరఫు న్యాయవాది అభినాశ్‌ కుమార్‌ మీడియాకు వెల్లడించారు. నిందితుడిని డిసెంబర్‌ 1, 5 తేదీల్లో దిల్లీ రోహిణిలోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్‌)కి తీసుకెళ్లేందుకు పోలీసులు దరఖాస్తు చేసుకోగా.. న్యాయస్థానం అందుకు అనుమతించిందని ఆయన తెలిపారు. ఆఫ్తాబ్‌కు సోమవారం రోహిణిలోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీలో పాలీగ్రాఫ్‌ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.  పాలీగ్రాఫ్‌ పరీక్ష పూర్తికావడంతో ఇక నార్కో ఎనాలసిస్‌ పరీక్ష మిగిలింది. తాజాగా న్యాయస్థానం అందుకు అనుమతి ఇవ్వడంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 28 ఏళ్ల ఆఫ్తాబ్‌.. తన ప్రియురాలు శ్రద్ధా వాకర్‌ను చంపి 35 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచి పెట్టి.. రాత్రిపూట దిల్లీలోని పలు ప్రాంతాల్లో విసిరేసిన ఘటన యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నవంబర్‌ 12న నిందితుడిని అరెస్టు చేశారు. 

దేశంలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆఫ్తాబ్‌ ఆమిన్‌ పూనావాలాకు దర్యాప్తు సంస్థలు ఇప్పటికే పాలిగ్రాఫ్‌ (Polyghraph) నిర్వహించగా..  నార్కో టెస్టు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నేర పరిశోధనలో నార్కో అనాలసిస్‌ పరీక్షలు (Narco Test) ఎందుకంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి..? ఎలా చేస్తారనే విషయాలను ఓసారి పరిశీలిస్తే.. 

ఏమిటీ నార్కో అనాలసిస్?

నార్కో అనాలసిస్‌ (Narco Test) అనేది గ్రీకు పదమైన నార్కో (అనెస్థీషియా అని అర్థం) నుంచి వచ్చింది. ఈ పరీక్షలో భాగంగా వ్యక్తి శరీరంలోకి ఓ ఔషధాన్ని (సోడియం పెంటోథాల్‌, స్కోపలామైన్‌,, సోడియం అమైథాల్‌) ఎక్కిస్తారు. దీన్నే ట్రూత్‌ సీరం అని కూడా అంటారు. ఆ వ్యక్తి వయసు, ఆరోగ్యం, భౌతిక స్థితి ఆధారంగా ఔషధ డోసును ఇస్తారు. ఇది ఇచ్చిన కొన్ని సెకన్లలోనే ఆ వ్యక్తి స్పృహ కోల్పోతాడు. ఈ సమయంలో వ్యక్తి నాడీ వ్యవస్థను పరమాణు స్థాయిలో ప్రభావితం చేస్తారు. ఆ సమయంలో దర్యాప్తు అధికారులు అడిగే ప్రశ్నలకు నిందితుడు తేలికగా సమాధానాలు వెల్లడిస్తాడు. స్పృహలో ఉన్నప్పుడు చెప్పని విషయాలనూ స్వేచ్ఛగా బహిరంగపరుస్తాడు. ఆ సమయంలో అతడి పల్స్‌, బీపీని నిపుణులు అనుక్షణం పర్యవేక్షిస్తారు. ఒకవేళ అవి పడిపోతున్నట్లు గ్రహిస్తే.. వెంటనే నిందితుడికి ఆక్సిజన్‌ అందిస్తారు.

పాలిగ్రాఫ్‌, నార్కో పరీక్షలను చేయడానికి ఆ వ్యక్తి అంగీకారం తప్పనిసరి. అతడి అంగీకారం లేకుండా బ్రెయిన్‌ మ్యాపింగ్, పాలిగ్రాఫ్‌, నార్కో అనాలిసిస్‌ టెస్టులను నిర్వహించకూడదని సుప్రీం కోర్టు ఇదివరకే తీర్పు ఇచ్చింది. అయితే, నార్కో అనాలసిస్‌లో వ్యక్తి ఇచ్చే స్టేట్‌మెంట్లను ప్రధాన సాక్ష్యాలుగా కోర్టులు పరిగణించవు. కేవలం వాటిని ఆధారాలుగా మాత్రమే తీసుకుంటాయి.

గతంలో చాలా కీలకమైన కేసులను ఛేదించడంలో ఈ పద్ధతులను అధికారులు ఉపయోగించారు. 2002లో జరిగిన గుజరాత్‌ అల్లర్ల కేసు, అబ్దుల్‌ కరీం తెల్గీ స్టాంపు పేపర్ల కుంభకోణం, 2006లో నోయిడా సీరియల్‌ మర్డర్స్‌, 26/11 ముంబయి ఉగ్రదాడి కేసులో అబ్దుల్‌ కసబ్‌ల విచారణ సమయంలో నార్కో పరీక్షలు నిర్వహించారు. తాజాగా దిల్లీలో శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆఫ్తాబ్‌కూ పాలిగ్రాఫ్‌ పరీక్షను పూర్తి చేసిన అధికారులు నార్కో టెస్ట్‌ నిర్వహించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని