Covid: దిల్లీలో కరోనా ఉద్ధృతి.. ప్రతిరోజు సగటున 8-10మంది మృతి!

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి అదుపులోనే ఉన్నప్పటికీ రాజధాని దిల్లీలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ప్రతిరోజు రెండువేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి........

Published : 16 Aug 2022 20:46 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి అదుపులోనే ఉన్నప్పటికీ రాజధాని దిల్లీలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ప్రతిరోజు రెండువేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రుల్లో చేరికలూ పెరుగుతున్నాయి. ప్రతిరోజు సగటున 8-10 మంది మృతిచెందుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణలు హెచ్చరిస్తున్నారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.

కరోనా కేసుల ఉద్ధృతి నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని దిల్లీ లెఫ్టెనెంట్‌ గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా ట్వీట్‌ చేశారు. ‘కొవిడ్‌ వ్యాప్తిని చూస్తున్నాం. అధిక కేసులు, పాజిటివిటీ రేటు నమోదవుతోంది. మహమ్మారి ఇంకా కొనసాగనుందనే విషయాన్ని మనం గ్రహించాలి. కరోనా నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించాలి’ అని పేర్కొన్నారు. వైద్య నిపుణురాలు, లాన్సెట్‌ కమిషన్‌ సభ్యురాలు సునీలా గార్గ్‌ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. రికవరీ రేటు పెరుగుతున్నప్పటికీ, ఆసుపత్రుల్లో చేరికలు కూడా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా భయపడాల్సిన అవసరం లేదని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

సోమవారం మినహా.. గడిచిన 12రోజులు దిల్లీలో వరుసగా 2వేలకు పైగానే కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. సోమవారం 1,227 కేసులు నమోదవగా, పాజిటివిటీ రేటు 14.57శాతంగా ఉంది. ఎనిమిది మంది మరణించారు. అంతకుముందు ఆదివారం 2,162 మందికి పాజిటివ్‌గా తేలింది. ఐదుగురు ప్రాణాలు విడిచారు. అంతకుముందు రోజు 2,031 మందికి కరోనా నిర్ధారణ కాగా, తొమ్మిది మంది మృతిచెందారు. కేసుల విజృంభణతో దిల్లీ ప్రభుత్వం మాస్కులను తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని