Corona effect: దిల్లీకి మరో సమస్య!

ఆక్సిజన్‌ కొరతతో ఇప్పటికే సతమతమవుతున్న రాజధాని దిల్లీ నెత్తిన మరో సమస్య కూర్చుంది. రోజురోజుకూ పరీక్షల సంఖ్య పెరిగిపోతుండటంతో డయాగ్నస్టిక్‌ ల్యాబుల్లో పరీక్షించేందుకు అవసరమైన మెటీరియల్‌ తగ్గిపోతోందని, త్వరలోనే దీనికి కూడా కొరత ఏర్పడే పరిస్థితులున్నాయని దిల్లీ డయాగ్నస్టిక్‌ కేంద్రాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి....

Published : 24 Apr 2021 20:44 IST

దిల్లీ: ఆక్సిజన్‌ కొరతతో ఇప్పటికే సతమతమవుతున్న రాజధాని దిల్లీ నెత్తిన మరో సమస్య కూర్చుంది. రోజురోజుకూ పరీక్షల సంఖ్య పెరిగిపోతుండటంతో డయాగ్నస్టిక్‌ ల్యాబుల్లో పరీక్షించేందుకు అవసరమైన మెటీరియల్‌ తగ్గిపోతోందని, త్వరలోనే దీనికి కూడా కొరత ఏర్పడే పరిస్థితులున్నాయని దిల్లీ డయాగ్నస్టిక్‌ కేంద్రాల వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు మెడికల్‌ ఆక్సిజన్‌ కొరత, మరోవైపు ఆస్పత్రుల్లో పడకల కొరతతో తలపట్టుకున్న దిల్లీ ప్రభుత్వానికి తాజా సమస్యతో మూలిగేనక్కపై తాటిపండు పడినట్లయింది. ప్రభుత్వం ముందుగానే స్పందించి అన్ని డయాగ్నస్టిక్‌ కేంద్రాలకు మెటీరియల్‌ సరఫరా అయ్యేలా చూడాలని కోరుతున్నాయి.

ఓ వ్యక్తికి పాజిటివ్‌ సోకిన తర్వాత కూడా అతని ఆరోగ్య పరిస్థితిని బట్టి వివిధ రకాల టెస్టులు చేయాల్సి ఉంటుందని, ఆయా రిపోర్టులను బట్టి వైద్యులు చికిత్స కొనసాగిస్తారని ప్రముఖ డయాగ్నస్టిక్‌ సెంటర్‌ నిర్వాహకుడు డా. డాంగ్‌ తెలిపారు. దీనికోసం ఉపయోగించాల్సిన మెటీరియల్‌ వేరేగా ఉంటుందన్నారు. మరోవైపు సరిపడినంత మెటీరియల్‌ లేనందున పేరెన్నికగన్న డయాగ్నస్టిక్‌ సెంటర్‌ లాల్‌పాత్‌ ల్యాబ్‌ కొవిడ్‌ అనుమానితుల నుంచి నమూనాలను తీసుకోవడం మానేసిందంటూ వస్తున్న వార్తలను ఆ సంస్థ కొట్టివేసింది. అదంతా తప్పుడు సమాచారమంటూ ట్విటర్‌లో పోస్టు చేసింది.

మెడికల్‌ ఆక్సిజన్‌, పడకలకు ప్రస్తుతం తీవ్ర కొరత ఏర్పడిన నేపథ్యంలో ల్యాబ్‌ మెటీరియల్‌కు భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే ముందుగానే అప్రమత్తం చేసినట్లు డయాగ్నస్టిక్‌ కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. ఈ సమస్య తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని