Manish Sisodia: సిసోదియాకు దక్కని ఊరట.. ఏప్రిల్‌ 3 వరకు జైల్లోనే

Delhi excise policy scam: మద్యం కుంభకోణం కేసులో మనీస్‌ సిసోదియా జ్యుడీషియల్‌ కస్టడీని మరోసారి పొడగించారు. దీంతో మరో 14 రోజులు ఆయన జైల్లోనే ఉండనున్నారు.

Published : 20 Mar 2023 21:42 IST

దిల్లీ: మద్యం కుంభకోణం (Delhi excise policy scam) కేసులో అరెస్టయిన దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోదియా (Manish Sisodia) ఇప్పుడిప్పుడే జైలు నుంచి బయటకు వచ్చేలా కన్పించట్లేదు. ఈ కేసులో ఆయన జ్యుడీషియల్‌ కస్టడీ (Judicial Custody)ని రౌస్‌ అవెన్యూ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. దీంతో ఏప్రిల్‌ 3వ తేదీ వరకు ఆయన జైల్లోనే ఉండనున్నారు.

ప్రభుత్వ మద్యం విధాన రూపకల్పన, అమలులో అవకతవకలు చోటుచేసుకున్న వ్యవహారంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఫిబ్రవరి 26న సిసోదియాను సీబీఐ (CBI) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కోర్టులో హాజరుపర్చగా.. తొలుత న్యాయస్థానం సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఆ తర్వాత జ్యుడీషియల్‌ కస్టడీ విధించడంతో ఆయనను తిహాడ్‌ జైలుకు తరలించారు. ఆ కస్టడీ నేటితో ముగియడంతో సిసోదియా (Manish Sisodia)ను నేడు కోర్టులో వర్చువల్‌గా హాజరుపర్చారు. అయితే ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు కీలక దశలో ఉందని, అందువల్ల ఆయనను మరికొన్ని రోజుల పాటు కస్టడీలోనే ఉంచాలని సీబీఐ (CBI) న్యాయస్థానాన్ని కోరింది. దీంతో సిసోదియా జ్యుడీషియల్‌ కస్టడీని కోర్టు ఏప్రిల్‌ 3వ తేదీ వరకు పొడిగించింది.

ఇక, ఇదే వ్యవహారంలో దర్యాప్తు చేపట్టిన ఈడీ (ED).. జైల్లో ఉన్న సిసోదియాను ఇటీవల తమ కస్టడీలోకి తీసుకుంది. ఈ మద్యం కుంభకోణానికి(Delhi excise policy scam) సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఆయన ఈడీ కస్టడీని మార్చి 22 వరకు పొడగిస్తూ ఇటీవల దిల్లీ కోర్టు ఆదేశాలు వెలువరించింది. మరోవైపు, ఈ కేసులో సిసోదియా దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై రౌస్‌ అవెన్యూ కోర్టు మంగళవారం (మార్చి 21) విచారణ చేపట్టనుంది.

జ్యుడీషియల్‌ కస్టడీకి అరుణ్‌ పిళ్లై..

మద్యం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మరో నిందితుడు అరుణ్‌ రామచంద్ర పిళ్లై కస్టడీని మరోసారి పొడిగించారు. ఈడీ అభ్యర్థన మేరకు ఇప్పటికే 3 రోజుల పాటు కస్టడీని పొడిగించిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. తాజాగా మరో 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది. న్యాయస్థానం తీర్పు అనంతరం అరుణ్‌ పిళ్లైని తిహాడ్‌ జైలుకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని