Delhi liquor scam: దిల్లీ మద్యం కుంభకోణం కేసు.. సిసోదియా సన్నిహితుడి అరెస్ట్‌

దిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా సన్నిహితుడిని ఈడీ అరెస్టు చేసింది. 

Published : 30 Nov 2022 10:40 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని మద్యం కుంభకోణం వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ముమ్మర దర్యాప్తు సాగిస్తోంది. ఈ కేసులో దిల్లీకి చెందిన మద్యం వ్యాపారి అమిత్ అరోఢాను ఈడీ తాజాగా అరెస్టు చేసింది. దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా సన్నిహితుడైన అమిత్‌.. గురుగ్రామ్‌లోని బుడ్డీ రిటైల్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీకి డైరెక్టర్‌గా ఉన్నారు. మనీలాండరింగ్‌ ఆరోపణలతో గత రాత్రి అమిత్‌ను అరెస్టు చేసినట్లు ఈడీ వర్గాలు బుధవారం వెల్లడించాయి. నేడు అతడిని కోర్టులో హాజరుపర్చి కస్టడీ కోరే అవకాశముంది.

కాగా.. తాజా అరెస్టుతో కలిపి ఈ కేసులో ఇప్పటివరకు ఈడీ మొత్తం నలుగురిని అరెస్టు చేయగా.. మరో ఇద్దరిని సీబీఐ కస్టడీ నుంచి అదుపులోకి తీసుకుంది. సెప్టెంబరులో దిల్లీకి చెందిన మద్యం వ్యాపారి, ఇండో స్పిరిట్‌ కంపెనీ యజమాని సమీర్‌ మహేంద్రును అదుపులోకి తీసుకోగా.. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలకు చెందిన అరబిందో గ్రూప్‌ డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డి, మద్యం వ్యాపారి బినోయి బాబును ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇదే కేసులో సీబీఐ అరెస్టు చేసిన రాబిన్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఎల్‌ఎల్‌పీ డైరెక్టర్‌ అభిషేక్‌ బోయినపల్లి, విజయ్‌ నాయర్‌ను కోర్టు ద్వారా ఈడీ తమ కస్టడీలోకి తీసుకుంది.

మరోవైపు, మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఇటీవల మూడువేల పేజీలతో ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఇందులో సమీర్‌ను ఏ1గా పేర్కొంది. అయితే ఈ ఛార్జిషీట్‌లో సిసోదియా పేరు లేకపోవడం గమనార్హం. అటు సీబీఐ కూడా ఎఫ్‌ఐఆర్‌లో సిసోదియా పేరును చేర్చగా.. ఛార్జిషీట్‌లో నమోదు చేయలేదు. ఈ కేసులో సిసోదియా సన్నిహితులు అమిత్ అరోఢా, దినేశ్ అరోఢా, అర్జున్‌ పాండేపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఇందులో దినేశ్ అప్రూవర్‌గా మారినట్లు ఇటీవల కోర్టుకు సీబీఐ తెలియజేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని