Delhi New LG: అనిల్‌ బైజల్‌ రాజీనామా ఆమోదం.. దిల్లీకి కొత్త ఎల్జీని నియమించిన రాష్ట్రపతి

దేశ రాజధాని దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అనిల్‌ బైజల్‌ ఇచ్చిన రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.....

Updated : 23 May 2022 21:36 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అనిల్‌ బైజల్‌ ఇచ్చిన రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదించారు. ఆయన స్థానంలో కొత్త ఎల్జీని నియమించారు. నూతన లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా వినయ్‌ కుమార్‌ సక్సేనాను నియమించినట్టు రాష్ట్రపతి కార్యాలయం సోమవారం ప్రకటించింది. వ్యక్తిగత కారణాలతో అనిల్‌ బైజల్‌ ఇటీవల అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో కొత్త లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా వినయ్‌ కుమార్‌ సక్సేనాను నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వినయ్‌ కుమార్‌ సక్సేనా ప్రస్తుతం భారత ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ ఛైర్మన్‌గా ఉన్నారు.

1958 మార్చి 23న జన్మించిన వినయ్ కుమార్ సక్సేనా.. కాన్పూర్ యూనివర్సిటీలో ఉన్నతవిద్యను అభ్యసించారు. రాజస్థాన్‌లోని జేకే గ్రూప్‌ సంస్థలో అసిస్టెంట్ ఆఫీసర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. వైట్ సిమెంట్ ప్లాంట్‌తో వివిధ హోదాల్లో 11 ఏళ్ల పాటు పనిచేసిన అనంతరం గుజరాత్‌లోని ప్రతిపాదిత పోర్ట్ ప్రాజెక్ట్‌ పనులను పర్యవేక్షించేందుకు గాను 1995లో జనరల్ మేనేజర్‌గా పదోన్నతి పొందారు. ఆ తర్వాత సీఈఓగా బాధ్యతలు చేపట్టి, ధోలేర్ పోర్టు ప్రాజెక్ట్ డైరెక్టర్‌ స్థాయికి ఎదిగారు. అనంతరం కేవీఐసీ ఛైర్మన్‌ పదవిని చేపట్టి.. ప్రస్తుతం ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. 

భారత స్వాతంత్ర్య 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని.. గతేడాది మార్చిలో ప్రభుత్వం జాతీయ కమిటీ సభ్యులలో ఒకరిగా వినయ్ సక్సేనాను నియమించింది. ఈ కమిటీకి ప్రధానమంత్రి నేతృత్వం వహిస్తున్నారు. మాజీ రాష్ట్రపతి, మాజీ ప్రధాని, క్యాబినెట్ మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు తదితరులు సభ్యులుగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని