Ban on fire crackers: దిల్లీలో టపాసులపై నిషేధం

వాయు కాలుష్యాన్ని నివారించేందుకు దీపావళి సమయంలో టపాసులపై దిల్లీ ప్రభుత్వం మరోసారి నిషేధాన్ని విధించింది.....

Published : 15 Sep 2021 23:52 IST

దిల్లీ: వాతావరణ సంరక్షణ నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాయు కాలుష్యాన్ని నివారించేందుకు దీపావళి సమయంలో టపాసులపై మరోసారి పూర్తి నిషేధాన్ని విధించింది. బాణసంచా నిల్వ, విక్రయాలు, వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ బుధవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘దీపావళి సందర్భంగా గత మూడు సంవత్సరాలుగా దేశ రాజధానిలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుంది. అందుకే గతేడాది మాదిరిగానే ఈసారి కూడా దిల్లీలో అన్ని రకాల టపాసుల నిల్వ, అమ్మకం, వినియోగంపై పూర్తిస్థాయి నిషేధాన్ని అమలు చేస్తున్నాం’అని  కేజ్రీవాల్ ట్విటర్‌లో పేర్కొన్నారు. గతేడాది నిషేధం విధించేకంటే ముందే వ్యాపారులు సరకు కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారని, ఫలితంగా నష్టాలను ఎదుర్కొన్నారని పేర్కొన్న కేజ్రీవాల్‌.. నిషేధాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి సరకు కొనుగోలు చేయొద్దని వ్యాపారులకు సూచించారు.

వాతావరణ కాలుష్యాన్ని వివారించేందుకు దిల్లీ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. వేడుకలు, సమావేశాలు వంటి కార్యక్రమాల్లో నిబంధనలు ఉల్లంఘించి శబ్దకాలుష్యానికి పాల్పడితే రూ.లక్ష వరకు జరిమానా విధించనున్నట్లు దిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ) ఈ ఆగస్టులో వెల్లడించింది. పండగ సమయాల్లో  నివాస, వాణిజ్య సముదాయాల్లో నిర్ణీత గడువు తర్వాత కూడా టపాసులు పేల్చేవారికి రూ.1000 జరిమానా విధిస్తున్నారు. అదే సైలెంట్‌ జోన్లలో ఈ జరిమానా రూ.3000గా ఉంది. నివాస సముదాయాల్లో పెళ్లి వేడుకలు, పబ్లిక్‌ ర్యాలీలు, మతపరమైన కార్యక్రమాల్లో బాణసంచా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.10,000 చెల్లించాలి. సైలెంట్‌ జోన్లలో ఈ జరిమానా రూ.20వేలుగా ఉంది. ఈ ప్రాంతాల్లో రెండోసారి కూడా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.40వేలు, అంతకంటే ఎక్కువసార్లు ఉల్లంఘిస్తే రూ.లక్ష జరిమానా విధిస్తామని అధికారులు వెల్లడించారు. అంతేగాక, ఆ ప్రాంతాన్ని సీల్‌ చేస్తామని కూడా హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు