
బ్లాక్‌మార్కెట్‌లో ఆక్సిజన్: దిల్లీ ప్రభుత్వం విఫలం!
కఠిన చర్యలు తీసుకోవాలన్న దిల్లీ హైకోర్టు
దిల్లీ: దేశరాజధాని దిల్లీలో పలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత వేధిస్తూనే ఉంది. కొవిడ్ బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్‌మార్కెట్‌లో లభ్యం కావడం పట్ల దిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా రోగులకు చికిత్సలో వినియోగించే ఆక్సిజన్ సిలిండర్లు, ఔషధాలను బ్లాక్‌మార్కెట్‌కు వెళ్లకుండా నియంత్రించడంలో దిల్లీ ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
దిల్లీలో ఆక్సిజన్ బ్లాక్ మార్కెటింగ్‌పై జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ రేఖా పల్లీ ధర్మాసనం నేడు విచారణ జరిపింది. తాజా పరిస్థితుల గురించి ఆక్సిజన్ రీఫిల్లర్లను నేరుగా విచారించిన ధర్మాసనం.. ఇది రాబందులుగా మారే సమయం కాదని అభిప్రాయపడింది. ‘బ్లాక్‌మార్కెట్ జరుగుతున్న విషయం మీకు తెలుసా. ఇవి మంచి సంకేతాలేనా? అని ఆక్సిజన్ రీఫిల్లర్లను హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఇదో పెద్ద గందరగోళంగా తయారయ్యిందన్న న్యాయస్థానం, దీన్ని పరిష్కరించడంలో దిల్లీ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని అభిప్రాయపడింది. మీకు అన్ని అధికారాలున్నాయని.. ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దిల్లీ ప్రభుత్వానికి సూచించింది.
దిల్లీలో నెలకొన్న ఆక్సిజన్ సంక్షోభంపై సోమవారం దాదాపు మూడున్నర గంటలపాటు విచారణ జరిపిన దిల్లీ హైకోర్టు.. మంగళవారం కూడా విచారణ కొనసాగించింది. మంగళవారం జరిపిన విచారణలో ఆక్సిజన్ రీఫిల్లర్లకు హైకోర్టు ధర్మాసనం పలు హెచ్చరికలు చేసింది.