Lockdown: దిల్లీలో మరోవారం పొడిగింపు..!

దేశరాజధాని దిల్లీలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలోకి వచ్చినప్పటికీ ముందుజాగ్రత్త చర్యగా మరోవారం పాటు (మే 31వరకు) లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు.

Updated : 23 May 2021 14:03 IST

కొవిడ్‌ పాజిటివిటీ రేటు 2.5శాతానికి తగ్గిందన్న సీఎం కేజ్రీవాల్‌

దిల్లీ: దేశరాజధాని దిల్లీలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలోకి వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడి కొవిడ్‌ పాజిటివిటీ రేటు 2.5శాతానికి తగ్గిపోయింది. అయినప్పటికీ ముందుజాగ్రత్త చర్యగా మరోవారం పాటు (మే 31వరకు) లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఇదే తరహాలో కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తే మే 31 నుంచి ఆంక్షలు సడలించే (అన్‌లాక్‌) ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు.

‘కరోనా వైరస్‌ ఉద్ధృతి బలహీనపడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయినప్పటికీ వైరస్‌పై విజయం సాధించినట్లు కాదు. కేవలం వ్యాప్తిని అదుపులోకి తీసుకొచ్చాం. గతంలో 35శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు 2.5శాతానికి (గడిచిన 24గంటల్లో ) తగ్గింది’ అని కేజ్రీవాల్‌ వెల్లడించారు. సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఎంతకాలం ఉంటుందో తెలియని సమయంలో మహమ్మారిపై యావత్‌ దిల్లీ ప్రజలు సమైక్యంగా పోరాటం చేశారని గుర్తుచేశారు. ముఖ్యంగా తీవ్ర ఆక్సిజన్‌ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో దిల్లీ ప్రజలు సహకరించారన్నారు. ప్రస్తుతం దిల్లీని వ్యాక్సిన్‌ కొరత వేధిస్తోందని.. అయినప్పటికీ త్వరలోనే దీనికి పరిష్కారం కనుగొంటామని కేజ్రీవాల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక తక్కువ సమయంలోనే సాధ్యమైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ అందించడమే తమ ప్రాధాన్యత అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. సాధ్యమైనంత తొందరగా ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకున్నట్లయితే మూడో ముప్పు (థర్డ్‌వేవ్‌) నుంచి బయటపడవచ్చని తెలిపారు. 3నెలల్లోనే దిల్లీ మొత్తం వ్యాక్సిన్‌ పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ వ్యాక్సిన్‌ కొరత వేధిస్తుందన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వంతోపాటు విదేశాల నుంచి వ్యాక్సిన్‌ సేకరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని దిల్లీ సీఎం స్పష్టంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని