Delhi vs Centre: దిల్లీలో పాలనాధికారం స్థానిక ప్రభుత్వానిదే..

Delhi vs Centre Row: దిల్లీలో ఎన్నికైన ప్రభుత్వానికే అసలైన అధికారాలు ఉంటాయని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వ నిర్ణయాలకు ఎల్‌జీ కట్టుబడి ఉండాలని తేల్చి చెప్పింది.

Updated : 11 May 2023 13:20 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi)లో పాలనా సర్వీసులపై (Administrative Services) నియంత్రణాధికారం ఎవరికి ఉండాలనే వివాదంలో అరవింద్‌ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సర్కారుకు సుప్రీంకోర్టు (Supreme Court)లో భారీ విజయం లభించింది. ప్రభుత్వాధికారులపై ఎన్నికైన ప్రభుత్వానికే సర్వాధికారాలు ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ మేరకు ఐదుగురు సభ్యుల ధర్మాసనం గురువారం ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్‌జీ) కట్టుబడి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. శాంతిభద్రతలు మినహా మిగతా అన్ని అంశాలపై దిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉండాలని తెలిపింది.

‘‘ప్రజాస్వామ్యం, ఫెడరల్‌ విధానాలు.. రాజ్యాంగ మూలస్వరూపంలోని భాగమే. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అసలైన అధికారాలు.. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల చేతుల్లోనే ఉండాలి. పాలనా వ్యవహారాలపై నియంత్రణ కూడా వారిదే. ఎన్నికైన ప్రభుత్వం నిర్ణయాలకు ఎల్‌జీ (LG) కట్టుబడి ఉండాలి. అధికారులు మంత్రులకు నివేదించకపోతే.. వారి ఆదేశాలను పాటించకపోతే.. అప్పుడు సమగ్ర పాలనా విధానాలపై అది ప్రతికూల ప్రభావం చూపిస్తుంది’’ అని సుప్రీంకోర్టు తెలిపింది.

‘‘దిల్లీ (Delhi).. దేశంలోని ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల మాదిరిగా ఉండదు. దేశ రాజధాని అయినందున దీనికి ప్రత్యేక స్వరూపం ఉంది. ఇక్కడ పబ్లిక్‌ ఆర్డర్‌, భూమి, పోలీసు వ్యవస్థపై కార్యనిర్వాహక అధికారాలు కేంద్రానికే ఉంటాయి. అయితే, ఇతర రాష్ట్రాల మాదిరిగానే దిల్లీలోనూ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది. అందువల్ల పాలనా సర్వీసులపై అసలైన అధికారాలు ప్రజాప్రతినిధులతో కూడిన ప్రభుత్వానికే ఉంటాయి’’ అని ధర్మాసనం తేల్చి చెప్పింది.

దిల్లీలోని అన్ని పాలనా సర్వీసుల (Administrative Services)పై కేంద్రానికే నియంత్రణ ఉంటుందంటూ 2015లో కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ అరవింద్‌ కేజ్రీవాల్‌ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ సానుకూల ఫలితం రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం 2019 ఫిబ్రవరి 14న ఈ వివాదంపై భిన్నాభిప్రాయ తీర్పును వెలువరించింది. పాలనా సర్వీసులపై దిల్లీ ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు లేవని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ చెప్పగా.. జస్టిస్‌ ఏకే సిక్రి దాన్ని వ్యతిరేకించారు.

దిల్లీలోని పాలనాధికారుల నియంత్రణకు సంబంధించిన శాసన, కార్యనిర్వాహక అధికారం కేంద్రానిదా, ఆ రాష్ట్ర ప్రభుత్వానిదా అనే వివాదాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేస్తున్నట్లు గతేడాది మే 6న సుప్రీంకోర్టు తెలిపింది. దీనిపై ఇటీవల విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం నేడు తీర్పు వెలువరించింది. ఈ క్రమంలోనే జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ ఇచ్చిన తీర్పును విస్తృత ధర్మాసనం తోసిపుచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని