Delhi: కరోనా ఉద్ధృతి.. దిల్లీలో వారంతపు కర్ఫ్యూ..

దేశ రాజధాని దిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన మూడు రోజుల్లో అక్కడ 10వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేసేందుకు

Updated : 04 Jan 2022 14:49 IST

కేసులు పెరుగుతున్న వేళ కఠిన ఆంక్షలు విధించిన ఆప్‌ సర్కారు

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన మూడు రోజుల్లో అక్కడ 10వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేసేందుకు ఇప్పటికే ‘ఎల్లో అలర్ట్‌’ను అమలు చేస్తోన్న దిల్లీ సర్కారు.. తాజాగా మరిన్ని కఠిన ఆంక్షలు విధించింది. కొవిడ్‌ తీవ్రత నేపథ్యంలోనే ఈ వారాంతం నుంచి వీకెండ్‌ కర్ఫ్యూను అమల్లోకి తెస్తున్నట్లు దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మంగళవారం వెల్లడించారు. ప్రతి శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూను అమలు చేయాలని దిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది.

ఒమిక్రాన్‌ వ్యాప్తితో దిల్లీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. నిన్న ఒక్క రోజే అక్కడ 4వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 6.46 శాతానికి చేరింది. గతేడాది మే తర్వాత పాజిటివిటీ రేటు ఈ స్థాయికి పెరగడం మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం. దీంతో కరోనా పరిస్థితులపై దిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ నేడు సమావేశమైంది. వరుసగా రెండు రోజుల పాటు పాజిటివిటీ రేటు 5శాతం దాటడంతో దిల్లీలో ‘రెడ్‌ అలర్ట్‌’ ఆంక్షలు విధించే అంశంపై అధికారులు సమీక్షించారు. ఇందులో భాగంగానే వారాంతపు కర్ఫ్యూ విధించాలని సిఫార్సు చేశారు. ఈ సిఫార్సులకు ఆప్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ శుక్రవారం నుంచే దీన్ని అమలు చేయనున్నట్లు దిల్లీ డిప్యూటీ సీఎం తెలిపారు. 

రెడ్‌ అలర్ట్‌లో ఆంక్షలివే..

రెడ్‌ అలర్ట్‌ కింద వీకెండ్‌ కర్ఫ్యూతో పాటు మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేసే అవకాశాలున్నాయి. 

🚫 అత్యవసర సేవలు మినహా పూర్తిగా కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. 

🚫 మాల్స్‌, సెలూన్స్‌ వంటి అత్యవసరం కాని దుకాణాలు మూతబడతాయి. 

🚫 ప్రజా రవాణాపై మరిన్ని ఆంక్షలు, వివాహాది శుభకార్యాలు, అంత్యక్రియల్లో పాల్గొనే వారిపై పరిమితులు విధించే అవకాశాలున్నాయి. 

🚫 ప్రభుత్వ కార్యాలయ సిబ్బంది ఇంటి నుంచే పనిచేయాల్సి ఉంటుంది. 

🚫 ప్రైవేటు కార్యాలయాలు 50శాతం సిబ్బందితో నిర్వహించుకునేందుకు అనుమతి ఉంటుంది. 

ఇప్పటికే డిసెంబరు 29 నుంచి దిల్లీలో ఎల్లో అలర్ట్‌ను అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లు, జిమ్‌ సెంటర్లను మూసివేశారు. దుకాణాలు, మాల్స్‌ను సరి-బేసి పద్ధతిలో తెరుచుకునేందుకు అనుమతినిచ్చారు.  మెట్రో, బస్సులను సగం సామర్థ్యంతో నడపాలని ఆదేశించారు. కానీ, దీని వల్ల మెట్రో స్టేషన్లు, బస్సు స్టేషన్ల వద్ద రద్దీ పెరిగిన నేపథ్యంలో బస్సులు, మెట్రోలను 100శాతం సామర్థ్యంతో నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మాస్క్‌లు లేనివారిని అనుమతించేది లేదని స్పష్టం చేసింది. 

జనవరి 15 నాటికి రోజుకు 25వేల కేసులు..

దిల్లీలో వచ్చే వారం నాటికి కేసుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ వారంతం నాటికి రోజుకు 8-9 వేల కేసులు నమోదవ్వొచ్చని అంటున్నాయి. జనవరి 15 నాటికి రోజువారి కేసులు 20వేల నుంచి 25వేలకు పెరిగే అవకాశముందని, ఆసుపత్రుల్లో చేరికలు కూడా పెరుగుతాయని ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కేసుల పెరుగుదలకు డెల్టా, ఒమిక్రాన్‌.. రెండు వేరియంట్లు కారణమని తెలిపాయి. గత రెండు రోజులుగా ఆసుపత్రుల్లో చేరికలు కూడా పెరగడం ఆందోళనలకు గురిచేస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని