పెట్రోల్‌ కావాలంటే.. ఈ సర్టిఫికెట్‌ చూపాల్సిందే!

కాలుష్యాన్ని అరికట్టే దిశగా దిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌ బంకుల్లో పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌ (పీయూసీ) సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేయనుంది......

Published : 30 Jan 2022 02:03 IST

అమల్లోకి తీసుకొచ్చే ఆలోచనలో దిల్లీ ప్రభుత్వం

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుతున్న నేపథ్యంలో దాన్ని తగ్గించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పెట్రోల్‌ బంకుల్లో పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌ (పీయూసీ) సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేయనుంది. ఈ ధ్రువపత్రం చూపిస్తేనే బంకుల్లో ఇకపై పెట్రోల్‌, డీజిల్‌ పోసేలా చర్యలకు సిద్ధమైంది. ఈ ప్రతిపాదనకు ప్రజల అభిప్రాయాన్ని కోరింది. రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ.. ఈ నిర్ణయం తీసుకుంటే దిల్లీలో కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలు నడపకుండా చర్యలు చేపట్టొచ్చని, ప్రజలు స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే అవకాశం ఉందన్నారు. కాలుష్యాన్ని అరికట్టడంతో ఈ విధానం సమర్థవంతంగా పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు.

పర్యావరణ మంత్రి సలహాదారు రీనా గుప్తా మాట్లాడుతూ.. ‘ఇంధనం కావాల్సిన సమయంలో వాహన యజమానులు తమ పీయూసీ ధ్రువపత్రాన్ని పెంట్రోల్‌ బంకుల వద్ద చూపించాలి. ఒకవేళ వారు చూపించిన సర్టిఫికెట్‌ చెల్లదని తేలితే.. బంకుల్లోనే దాన్ని జారీ చేసేలా చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు. కాగా ఈ ప్రతిపాదనపై ప్రజల అభిప్రాయాన్ని కూడా కేజ్రీవాల్‌ ప్రభుత్వం కోరింది. కర్బన ఉద్గారాలను నియంత్రించేందుకు వాహనాలకు పీయూసీ ధ్రువపత్రాన్ని జారీ చేస్తోంది అక్కడి ప్రభుత్వం.

దిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించే దిశగా కొద్దిరోజుల క్రితమే రాష్ట్ర సర్కారు కీలక ప్రకటన చేసింది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలకు అనుగుణంగా.. జనవరి 1, 2022 నాటికి పదేళ్లు పూర్తయిన డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయనున్నట్లు తెలిపింది. ఆ వాహనాలను ఇతర ప్రాంతాల్లో తిరిగి రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు వీలుగా ఎన్‌ఓసీ జారీ చేస్తామని తెలిపింది. 15 ఏళ్లు నిండిన పెట్రోల్ వాహనాలకూ ఇవే నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది.

స్థానికులు తమ పదేళ్లు దాటిన డీజిల్, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలను స్థానికంగా వినియోగించుకోవాలనుకుంటే.. వాటిని ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లు రవాణా శాఖ పేర్కొంది. అధీకృత ఏజెన్సీల ద్వారా ఎంప్యానెల్డ్ ఎలక్ట్రిక్ కిట్‌లను వాటిని అమర్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ అండర్‌ ప్రాసెస్‌లో ఉన్నట్లు వెల్లడించింది. లేని పక్షంలో.. అలాంటి వాహనాలను రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసు బృందాలు స్వాధీనం చేసుకుని, తుక్కుకు పంపుతాయని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని