Gopal Rai: వాటిపై జీఎస్టీ తగ్గించాలని కేంద్రాన్ని కోరతాం: దిల్లీ మంత్రి

జులై 1 నుంచి దేశవ్యాప్తంగా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై (single-use plastic) నిషేధం అమల్లోకి వచ్చిన వేళ దిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. .....

Published : 03 Jul 2022 18:01 IST

దిల్లీ: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై (single-use plastic) నిషేధం అమల్లోకి వచ్చిన వేళ దిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. నిషేధించిన ప్లాస్టిక్‌ వస్తువులకు ప్రత్యామ్నాయంగా ఉత్పత్తయ్యే వస్తువుల తయారీకి అవసరమైన ముడి సరకులపై జీఎస్టీ తగ్గించాలని కేంద్రాన్ని కోరతామన్నారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ (ఎస్‌ఓపీ)కు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనే అంశంపై మంత్రి గోపాల్‌ రాయ్‌ అధ్యక్షతన వాటాదారులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిషేధించిన ప్లాస్టిక్‌ వస్తువులపై ప్రజల్లో, కొన్ని ప్రభుత్వ సంస్థల్లో ఎంతో గందరగోళం నెలకొందన్నారు. నిషేధాన్ని అమలు చేయడంలో ఉన్న గందరగోళాన్ని తగ్గించేలా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. అంతేకాకుండా నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువుల్ని వాడితే కేసులు నమోదు చేసేందుకు వీలుగా ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నంబర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.

ఈ సందర్భంగా ప్రత్యామ్నాయ వస్తువుల తయారీకి అవసరమైన ముడిపదార్థాలపై జీఎస్టీ రేట్లు భారీగా ఉన్న విషయాన్ని పలువురు వ్యాపారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. ఈ అంశంపై కేంద్రానికి దిల్లీ ప్రభుత్వం లేఖ రాస్తుందన్నారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం అంటే ప్రజలు ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగ్‌లన్నింటిపైనా నిషేధం అనుకొంటున్నారని.. అందువల్ల దీనిపై తక్షణమే అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం తమ ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌కూడా రూపొందిస్తోందని చెప్పారు. నిషేధిత సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువుల్ని ఎవరైనా వాడితే రూ.లక్ష జరిమానా, ఐదేళ్లు జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందని శుక్రవారం గోపాల్‌రాయ్‌ హెచ్చరించని విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని