Arvind Kejriwal: కేజ్రీవాల్‌ ఆడియో, వీడియోలను తొలగించండి

ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మార్చి 28న కోర్టులో మాట్లాడుతున్నప్పటి వీడియోలు/ఆడియో రికార్డులను సామాజిక మాధ్యమ ఖాతాల నుంచి తొలగించాలని ఆయన సతీమణి సునీతను దిల్లీ హైకోర్టు ఆదేశించింది.

Published : 16 Jun 2024 05:19 IST

సునీతకు దిల్లీ హైకోర్టు ఆదేశం

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మార్చి 28న కోర్టులో మాట్లాడుతున్నప్పటి వీడియోలు/ఆడియో రికార్డులను సామాజిక మాధ్యమ ఖాతాల నుంచి తొలగించాలని ఆయన సతీమణి సునీతను దిల్లీ హైకోర్టు ఆదేశించింది. అలాగే అవి ఎక్కడున్నా తీసివేయాలని ఫేస్‌బుక్, యూట్యూబ్‌ వంటి సామాజిక మాధ్యమ వేదికలకు శనివారం ఆదేశాలిచ్చింది. దిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో కేజ్రీవాల్‌ అరెస్టైన సంగతి తెలిసిందే. ఆ కేసు విచారణలో భాగంగా మార్చి 28న ఆయన వ్యక్తిగతంగా హాజరై స్వయంగా వాదనలను వినిపించారు. ఆప్‌ను ఒక అవినీతికర పార్టీగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారని ఆ సందర్భంగా ఆరోపించారు. ఆ వాదనకు సంబంధించిన ఆడియో/వీడియోలను ఆప్‌తోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాయంటూ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అలా విచారణలను రికార్డు చేయడం ‘హైకోర్టు ఆఫ్‌ దిల్లీ రూల్స్‌ ఫర్‌ వీడియో కాన్ఫరెన్సింగ్‌ ఫర్‌ కోర్ట్స్‌ (2021)’ నిబంధనల ప్రకారం నిషిద్ధమంటూ పిటిషనరు వాదించారు. వీటిని వైరల్‌ చేయడంద్వారా న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తుల ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు యత్నించారని పేర్కొన్నారు. ఇదంతా ఆప్, అరవింద్‌ కేజ్రీవాల్‌ కుట్రలో భాగమని ఆరోపించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక ‘ఎక్స్‌’ యూజర్‌ అప్‌లోడ్‌ చేసిన వీడియో, ఆడియో రికార్డును సునీత తన సోషల్‌ మీడియా ఖాతాల్లో రీపోస్టు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. వాటిని తొలగించాలంటూ సునీతతోపాటు సోషల్‌ మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని